
హైదరాబాద్: గతంలో ప్రజలను పట్టించుకోని నేతలు.. తమకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. కేససముద్రంలో బహిరంగ సభలో మంత్రులు సీతక్క, పొంగులేటి పాల్గొన్నారు. 780 మంది రైతులకు భూధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలోనే 25 లక్షల ఎకరాల భూమి పంచామని, 150 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అడుగుతున్నారని..త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించామని, మహబూబాబాద్ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారని, పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారని, పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారని కొనియాయాడారు. ఎవరో గగ్గోలు పెడితే తాము పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.











