
ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి జపాన్‌లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ ఆసియా క్రీడలకు ముందు భారత బృందానికి షాక్ తగిలింది. జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గాయపడ్డాడు. శిక్షణ సమయంలో అతడి చీలమండ లిగమెంట్‌కు గాయమైంది. దీంతో ఆసియా క్రీడలకు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని నీరజ్ చోప్రా శనివారం సోషల్‌మీడియా ద్వారా తెలియజేశాడు.
‘‘ఎంతో కష్టపడిన తర్వాత లుసానె డైమండ్ లీగ్‌లో ఈ సీజన్‌లో అత్యుత్తమ (88.05 మీటర్లు) త్రోను అందుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది కాలానికే శిక్షణ సమయంలో నా చీలమండ వద్ద లిగమెంట్ చిట్లపోయింది. వైద్యుడితో పాటు నా టీమ్‌తో చర్చించిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది నిరాశ కలిగించే విషయం. నా ఆటలో రిథమ్‌ను అందుకునే దశకు చేరుకున్నానని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఇప్పుడు నా దృష్టి పూర్తిగా కోలుకోవడం, మరింత దృఢంగా తిరిగి రావడంపైనే ఉంది’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.











