సిడ్నీ: ఆస్ట్రేలియాలో కంటే భారత్‌లో తనకు ఎక్కువ ఆదరణ లభించిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అన్నారు. సిడ్నీలోని భారత కాన్సులేట్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వాట్సన్ పాల్గొని ప్రసంగించారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగమవడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు. తనకు 19 ఏళ్లు ఉన్నప్పుడు తొలిసారి భారత్‌లో పర్యటించానని.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

‘‘ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం నాకెప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. భారతీయ ప్రజలు నా జీవితం, వృత్తిపై అద్భుతమైన ప్రభావం చూపారు. వారితో నాకు బలమైన అనుబంధం ఉంది. భారత్‌ నాకు మరో ఇల్లు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆస్ట్రేలియా తరఫున సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడే అదృష్టం లభించింది. కానీ భారతదేశంలో నాకు ఎప్పుడు ఎంతో ఆదరణ లభించేది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైంది. నా కెరీర్‌లో కీలకమైన ఆ సమయంలో అద్భుతమైన ప్రదర్శనలు చేసే అవకాశం నాకు ఆ వేదిక ద్వారా దక్కింది. ఆస్ట్రేలియాతో పోలిస్తే భారత్‌లో క్రికెట్‌ను ప్రేమించే వారు ఎక్కువ. కానీ, ఇండియాలో నన్ను ఎప్పుడూ అంతగా విమర్శించలేదని నేను భావించే వాడిని. అక్కడ నాకు ఎక్కువ మద్దతు లభించేది. అదే ఆస్ట్రేలియాలోనైతే బాగా ఆడినప్పుడు ప్రశంసలు.. ఒకవేళ బాగా ఆడకపోతే విమర్శలు ఎదురయ్యేవి’’ అని వాట్సన్ వివరించారు.