
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిప్రి పోలీస్ స్టేషన్ ఏరియాలోని మనోరి గ్రామంలో బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగినట్టు జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ పాల్ తెలిపారు. 11 మందిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. మృతులను ప్రియాంజలి (5), ప్రవీణ్ సింగ్ (13), జాహ్నవి (12), ఆదితయ (12),
రవి (8), అంజు (32), జ్ఞాన్ సింగ్ (40), విక్రమ్ సరోజ్ (35), అన్ష్ (6), నానా (4)గా గుర్తించారు. మృతులంతా ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలోనే నివసించే వారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదారు ఇళ్లు కూడా నేలమట్టమయ్యాయని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కాగా, పేలుడు తీవ్రత కారణంగా ఘటనా ప్రాంతం సమీపం నుంచి వెళ్లే ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌పై వెళ్లే రైళ్ల రాకపోకలను సుమారు గంటసేపు నిలిపివేశారు. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌ను మనోరి రైల్వే స్టేషన్‌కు వెనక్కి పంపించారు. ఢిల్లీ-వారణాసి ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ను ఘటనా స్థలానికి ముందున్న సయ్యద్ సరావన్ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.











