
నర్సు శిరీష మృతి కేసులో వీడిన మిస్టరీ
గదిలోకి చొరబడి అఘాయిత్యానికి యత్నించిన
బీహార్ వాసి ప్రతిఘటించడంతో గొంతు నొక్కి హత్య నిందితుడు రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న
సూపర్ వైజర్ సైనా ఉల్లాగా గుర్తింపు, అరెస్ట్
మనతెలంగాణ / సిటీబ్యూరో: అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన నర్సు కేసు మిస్టరీని పహాడీషరీఫ్ పోలీసులు ఛేదించారు. గదిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు అడ్డుకోవడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వికె శిరీష(21)పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆస్ప త్రిలో నర్సుగా చేరింది. ఆస్పత్రికి సమీపంలోనే గదిలో ఉంటూ.. రోజు విధుల కు హాజరయ్యేది. శనివారం విధులకు హాజరైన ఆమె మధ్యాహ్నం గదికి వచ్చిం ది. ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా బిహార్ రాష్ట్రానికి చెందిన సైనా ఉల్లా(35) కిటికీ నుంచి గదిలోకి దూకి, ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
బాధితురాలు ప్రతిఘటించడంతో గొంతునొక్కి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సైనాఉల్లా రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు పారిపోతుండగా అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నర్సును హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితం శిరీష నర్సుగా విధుల్లో చేరి.. ఆస్పత్రికి చెందిన గదిలో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం గదికి వెళ్లి తిరిగి రాలేదు. మేనేజ్‌మెంట్ శిరీషకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో సిబ్బందిని ఆమె ఉంటున్న గది వద్దకు పంపించారు. వారు కిటికీ నుంచి చూడగా నేలపై పడి ఉంది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా అప్పటికే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమె ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిసి ఫుటేజీను పరిశీలించగా నిందితుడిని ఆచూకీ లభించింది. మహేశ్వరం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.











