వాషింగ్టన్ : అమెరికాలోని ప్రసిద్ధ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతాన్ని భారీ ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 19మంది మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పార్కులో పర్యాటకులు, స్థానిక ప్రజలకు నీటిని సరఫరా చేసే ఏకైక పైప్‌లైన్ ధ్వంసమైంది. సోమవారం ఇదే ప్రాంతంలో మరిన్ని వర్షాలు, ఉరుములతో కూడిన పిడుగుపాట్లు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు వరద హెచ్చరికను జారీ చేశారు.నీటి కొరత నేపథ్యంలో సోమవారం నుంచి అత్యవసర నీటి పరిమితులు అమల్లోకి వచ్చాయి. పార్కులోని లాడ్జీలు, హోటళ్లలో పర్యాటకులు రాత్రి బస చేయడానికి అనుమతి లేకుండా చేశారు. ఏడాది పొడవునా అక్కడే నివసించే ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు సూచించారు.