రూ.500 కోట్ల భూమిని రూ.87కోట్లకే కట్టబెట్టే కుట్ర  

ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ అదే మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా..

ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం

కారుచౌకగా అప్పగిస్తారా? మీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా

మారిపోయింది సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్ నేత హరీశ్ బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: నగరం నడిబొడ్డు న మరో భారీ భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కా ర్ తెరలేపిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌టిసి క్రాస్ రోడ్, అజామాబాద్‌లో తె లంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల వి లువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ కేవలం రూ.87 కోట్లకే ఓ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ మేర కు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం పాలకులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని విమర్శించారు. రూ.500 కోట్ల విలువ చేసే ఆయిల్‌ఫెడ్ భూములను కేవలం రూ.87 కోట్లకు ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఆ సొమ్మును చెల్లించేందుకు ఆయిల్‌ఫెడ్ సిద్ధంగానే ఉందని, అయినా వారిని కాదని ప్రైవేటు వ్యక్తులకే భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపిస్తోందని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడాం

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠాణీల్లా వేల కోట్ల రూపాయల భూములు పంచుతోందని ఘాటు విమర్శలు చేశారు. మూడు దశాబ్దాలుగా ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న 3 ఎకరాల 23 గుంటల (15,984 గజాలు) భూమిని లాక్కునే దుర్మార్గం అని పేర్కొన్నారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను 22ఎ జాబితాలో పెట్టి వేధిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఒక్క అజామాబాద్ భూమి కథే కాదు అని, కోకాపేట, రాయదుర్గం, గచ్చిబౌలిలోనూ కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందానే నడుస్తోందని అన్నారు. ఇలా స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా ఆస్తులు అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో గుడికి, బడికి, చివరికి శ్మశానానికి కూడా రాష్ట్రంలో స్థలం మిగలదని మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దుచేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని సూచించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బిఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మహా పోరాటం చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.