
ఆరేళ్ల ఆదిత్య. చిన్న పేరు. చిన్న వయసు. కానీ అతని నోట వెలువడిన ప్రశ్నలు మాత్రం చాలా పెద్దవి! బీహార్ గడ్డపై ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువత మధ్య నిలబడి పోలీసులనూ, ప్రభుత్వాన్నీ ప్రశ్నించిన ఆ బాలుడి దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావచ్చు. మరో వీడియో వచ్చి దాన్ని మరుగున పడేయవచ్చు. కానీ ఆ చిన్నారి ప్రశ్న వెనుక దాగి ఉన్న పెద్ద ప్రశ్న మాత్రం అంత సులభంగా అదృశ్యం కాదు. పలకా -బలపం పట్టాల్సిన చేతిలోకి ‘ప్రశ్న’ ఎందుకు వచ్చింది? ఆడుకోవాల్సిన వయసులో ‘ఉద్యోగం’ అనే మాట ఎందుకు వచ్చింది? అతని బాల్యంలోకి నిరుద్యోగం ఎందుకు ప్రవేశించింది? ఇదే అసలు ప్రశ్న. ఆదిత్యను చూసి ఎంత తెలివైన పిల్లవాడు! అని ఆశ్చర్యపడటం కంటే.. మన రాజకీయ వ్యవస్థ ఇంత చిన్న వయసు పిల్లవాడి ప్రపంచంలోకి ఎందుకు వచ్చేసింది? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.
ఆదిత్య ఒక్కడే కాదు. అతను ఒక సంకేతం. కొత్త తరపు మేల్కొలుపునకు ఒక ప్రతీక. జన్‌జెడ్ ప్రశ్నించింది.. ఇప్పుడు జన్ ఆల్ఫా ప్రశ్నిస్తోంది! సోషల్ మీడియాను చూస్తే ఆదిత్య లాంటి ప్రశ్నించే గొంతులు అనేకం కనిపిస్తున్నాయి. ఎక్కడో పాఠశాలలో ఉపాధ్యాయులు ఎందుకు లేరని పిల్లలు అడుగుతున్నారు. మరోచోట రహదారులు ఎందుకు లేవని నిలదీస్తున్నారు. ఇంకొకచోట తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి కనీస సౌకర్యాల కోసం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక ప్రాంతపు కథ కాదు. ఒక రాష్ట్రపు పరిణామం కాదు. కొత్త తరపు గొంతు మెల్లగా దేశమంతా వినిపిస్తున్న సంకేతం. జన్‌జెడ్ ప్రశ్నించింది. ఇప్పుడు దాని తరువాతి తరం జన్ ఆల్ఫా -ప్రశ్నించడం మాత్రమే కాదు, ప్రశ్నను ప్రజా వేదికపైకి తీసుకురావడం నేర్చుకుంటోంది. వారి చేతిలో పుస్తకం మాత్రమే లేదు. మొబైల్ ఉంది. కెమెరా ఉంది. సమాచారం ఉంది. ముఖ్యంగా.. ప్రశ్న ఉంది!
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, పేస్‌బుక్ , పాడ్ కాస్ట్, షార్ట్ వీడియోస్, డిజిటల్ డిబేట్స్- ఇవన్నీ ఇప్పటికే కొత్త తరపు రాజకీయ సంభాషణకు వేదికలుగా మారుతున్నాయి! ఈ తరం నాయకుడి మాట విని అక్కడితో ఆగదు. వెతుకుతుంది. పోల్చుతుంది. పరిశీలిస్తుంది. అవసరమైతే విమర్శిస్తుంది. సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అధికారం ఎంత పెద్దదైనా ప్రశ్నించే హక్కును తన చేతిలోకి తీసుకుంటోంది. ఇదే ఆల్ఫా తరపు ప్రత్యేకత! భవిష్యత్తు అని పిలిచిన తరం.. వర్తమానానికి లెక్కలు అడుగుతోంది! పాలకులు యువతను దేశ భవిష్యత్తు అంటారు.
పిల్లలను రేపటి భారతదేశం అంటారు. కానీ ఒక విచిత్రమైన పరిణామం జరుగుతోంది. మీరు భవిష్యత్తు అంటున్న తరం.. ఈ రోజే మిమ్మల్ని ప్రశ్నిస్తోంది! మా పాఠశాల ఎలా ఉంది? మా ఉద్యోగం ఎక్కడ? మా భవిష్యత్తు ఏమిటి? మా హక్కులకు రక్షణ ఎక్కడ? మా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? అంటే పాలకులు భవిష్యత్తు అని పిలుస్తున్న తరం తన వర్తమానానికి జవాబులు కోరుతోంది. ఈ ప్రశ్న బిజెపిని మాత్రమే అడిగేది కాదు. కాంగ్రెస్‌ను మాత్రమే అడిగేది కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడగాల్సిన ప్రశ్న. ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి ఎంత ముఖ్యమో.. జవాబుదారీతనం అంతకంటే ముఖ్యమైనది.
ఆకలికి పార్టీ ఉండదు. పేదరికానికి పార్టీ ఉండదు. నిరుద్యోగానికి పార్టీ ఉండదు. నిరక్షరాస్యతకు పార్టీ ఉండదు! అందుకే వాటికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదు. దేశపు మౌలిక ప్రశ్నలు ఇంకా అక్కడే ఉన్నాయి! దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారాయి. నాయకులు మారారు. నినాదాలు మారాయి. ఎన్నికల హామీలు మారాయి. కానీ దేశపు మౌలిక ప్రశ్నలు మాత్రం ఇంకా మన ముందే ఉన్నాయి. ఆకలి. పేదరికం. నిరుద్యోగం. అసమానత. నాణ్యమైన విద్య. గౌరవప్రదమైన ఉపాధి. ఇవి ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొచ్చే అంశాలు కావు. ఐదేళ్లకోసారి అడిగే ప్రశ్నలు కావు. ఇవి ప్రతి పౌరుడి నిత్యజీవితపు ప్రశ్నలు. ప్రజలు ఓటు వేస్తారు. ప్రతినిధులను ఎన్నుకుంటారు.
అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపిస్తారు. అది ప్రజాస్వామ్య పవిత్ర ప్రక్రియ. కానీ ఆ తర్వాత? పార్టీ మార్పులు, ప్రజా ప్రతినిధుల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చేందుకు సంఖ్యాబలాన్ని మార్చే వ్యూహాలు, ఎన్నికల సమయంలో డబ్బు -ప్రలోభాలు- కులం- మతం -భావోద్వేగాలను ఉపయోగించి ఓటును ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు.. ఇవన్నీ ఒక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి: ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ ఓటు విలువ ఎంత? ప్రజల తీర్పును ఐదేళ్లపాటు గౌరవిస్తున్నారా? లేక రాజకీయ లెక్కలు మారితే ప్రజల తీర్పే పక్కన పడిపోతుందా? ఈ ప్రశ్నను రేపటి తరం మరింత తీవ్రంగా అడగబోతోంది. ప్రశ్నకు లాఠీ కాదు- సమాధానం కావాలి. కొత్త తరం కోరేది రాజకీయ మార్పు మాత్రమే కాదు.. ప్రక్షాళన! ఆల్ఫా తరం ఏ పార్టీని గెలిపించాలో మాత్రమే ఆలోచించదు. ఎలాంటి రాజకీయ సంస్కృతి కావాలో కూడా ఆలోచిస్తుంది. స్వచ్ఛమైన రాజకీయాలు. పారదర్శకమైన పాలన. జవాబుదారీతనం. ప్రజా ధనంపై లెక్క. ఎన్నికల హామీలపై జవాబు. అధికార దుర్వినియోగంపై ప్రశ్న. ఈ తరం రాజకీయ నాయకుడిని దేవుడిగా చూడదు. నాయకుడు తప్పు చేస్తే?
పార్టీ తప్పు చేస్తే? ప్రభుత్వం విఫలమైతే? హామీ నెరవేర్చకపోతే ఎందుకు ప్రశ్నించకూడదు? అనే ప్రశ్నలను అడుగుతుంది. ఈ ప్రశ్నే ప్రజాస్వామ్యానికి ప్రాణం. ఆల్ఫా తరం - రేపటి రాజకీయ ప్రక్షాళన! దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ గబ్బు ఒక్క పార్టీకి మాత్రమే పట్టింది కాదు. అది రాజకీయ సంస్కృతికే పట్టింది. అవినీతి. అధికార దాహం. అవకాశవాదం. వ్యక్తిపూజ. ప్రలోభ రాజకీయాలు. జవాబుదారీతనం లేని పాలన. ఈ తుప్పును మరో ఎన్నిక మాత్రమే తొలగించలేదు. కొత్త రాజకీయ సంస్కృతి మాత్రమే తొలగించగలదు. ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్నించే ప్రజల నుంచి. ప్రత్యేకంగా ప్రశ్నించడం నేర్చుకున్న కొత్త తరం నుంచి. బిజెపి అధికారంలో ఉంటే బిజెపిని ప్రశ్నించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి. ఇతర పార్టీ అధికారంలో ఉంటే దానినీ ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అధికార పార్టీ అనుమతితో వచ్చేది కాదు. అది ప్రజల హక్కు.
ఇది ఒక బాలుడి కథ కాదు.. ఒక తరం ఆవిర్భావం! ఆదిత్య ఈ రోజు ఒక ప్రశ్న అడిగాడు. అతని వెనుక మరెందరో పిల్లలు ఉన్నారు. తమ పాఠశాల గురించి ప్రశ్నిస్తున్న పిల్లలు. తమ హక్కుల గురించి మాట్లాడుతున్న పిల్లలు. తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పిల్లలు. ఈ రోజు ఒక ఆదిత్య. రేపు వేలాది ఆదిత్యలు. ఎల్లుండి లక్షలాది ప్రశ్నించే పౌరులు. అదే ప్రజాస్వామ్యం. అదే జవాబుదారీతనం. అదే రాజకీయ ప్రక్షాళన. రాబోయే తరం పాత రాజకీయాలను వారసత్వంగా మోసుకుపోవడానికి రావడం లేదు. అది ప్రశ్నించడానికి వస్తోంది. నిగ్గదీయడానికి వస్తోంది. లెక్క అడగడానికి వస్తోంది. ప్రజాస్వామ్యాన్ని శుభ్రపరచడానికి వస్తోంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ గబ్బును.. సంవత్సరాలుగా పేరుకున్న రాజకీయ తుప్పును.. తన ప్రశ్నలతో రుద్ది రుద్ది కడిగి పారేయడానికి వస్తోంది. మరి రేపటి భారతదేశం అడగబోయే ప్రశ్న ఒక్కటే- మీరు మమ్మల్ని న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, పారదర్శకంగా పాలించారా? మేము కోరుకున్న సముజ్వల భవిష్యత్తును నిర్మించారా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఎవరైనా సరే. ఏ పార్టీ అయినా సరే. ఏ నాయకుడైనా సరే!
- వీరేంద్ర కాపర్తి
(సీనియర్ జర్నలిస్టు)











