వరంగల్ జిల్లాలోని గీసుకొండ ప్రాంతంలో 2025 అక్టోబర్‌లో మృతి చెందిన ల్యాడెల్ల రాజు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజు మృతికి అసలు కారణమేంటో మరోసారి పరిశీలించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
రాజు భార్య ల్యాడెల్ల ప్రియాంక దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసును సహజ మరణంగా పేర్కొంటూ ముగించడాన్ని ఆమె కోర్టులో సవాలు చేశారు.
గతంలో కాకతీయ మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇచ్చిన వైద్య అభిప్రాయం ప్రకారం.. రాజు అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల మరణించారని, ఇది సహజ మరణమని పేర్కొన్నారు.
అయితే రాజు మృతదేహంపై కనిపించిన గాయాలను ఆయన భార్య కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం ఫొటోల్లో కూడా గాయాలు కనిపిస్తున్నాయని, పోస్టుమార్టం నివేదికలోనూ గాయాల ప్రస్తావన ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
గాయాలపై స్పష్టత ఇవ్వాలని కోర్టు
మృతదేహంపై ఉన్న గాయాల విషయంలో పోలీసులు గతంలో ఫోరెన్సిక్ నిపుణుల నుంచి పాయింట్-బై-పాయింట్ వివరణ కోరారు. అయితే ఆ తర్వాత వచ్చిన వివరణలోనూ రాజు మరణానికి గుండె ఆగిపోవడమే కారణమని పేర్కొన్నప్పటికీ.. గాయాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై తగిన వివరణ లేదని కోర్టు గుర్తించింది.
దీంతో గతంలో అభిప్రాయం ఇచ్చిన వైద్య నిపుణుడి కంటే ఉన్నత హోదాలో ఉన్న ఫోరెన్సిక్ నిపుణుడి నుంచి తాజా వైద్య అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు నిర్ణయించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి నుంచి తాజా అభిప్రాయం తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
మూడు నెలల్లో నివేదిక
సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.. రాజు పోస్టుమార్టం నివేదిక, మృతదేహం ఫొటోలు, గతంలో ఇచ్చిన ఫోరెన్సిక్ అభిప్రాయాలు, ఇతర సంబంధిత పత్రాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి పంపించాలని కోర్టు ఆదేశించింది.
తాజా ఫోరెన్సిక్ అభిప్రాయాన్ని మూడు నెలల్లోపు పొందాలని, ఆ నివేదిక అందిన తర్వాత పోలీసులు చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే తాజా నివేదిక ప్రతిని పిటిషనర్‌కు అందించాలని ఆదేశించింది.
అయితే హైకోర్టు ఇప్పటివరకు రాజు హత్యకు గురయ్యారని తేల్చలేదు. అందుబాటులో ఉన్న పోస్టుమార్టం వివరాలు, ఫొటోల్లో కనిపిస్తున్న గాయాల నేపథ్యంలో మరణానికి అసలు కారణాన్ని మరింత సమగ్రంగా నిర్ధారించేందుకు తాజా ఫోరెన్సిక్ అభిప్రాయం కోరింది.
ఈ కొత్త వైద్య నివేదిక ఆధారంగా కేసులో తదుపరి దర్యాప్తు, చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారనుంది.











