
హైదరాబాద్: ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఘట్‌కేసర్‌లో వడగళ్ల వాన పడింది. మెదక్, సూర్యాపేట జిల్లాల్లో వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వద్ద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని ర్యాలమడుగులో ఈదురులాలుల తీవ్రతకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పడిపోయింది. మంబోజిపల్లిలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.












