
అమరావతి: విశాఖ పట్టణం ముఖ చిత్రం ఒక్కరోజు నుంచే మారబోతుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని ఆనాడు అనుకున్న నిర్ణయం ఈనాడు కార్యరూపం దాల్చిందని అన్నారు. విశాఖ: తర్లువాడలో గూగుల్ ఎఐ డేటా సెంటర్ కు భూమిపూజ చేశారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న ప్రతీఒక్కరికీ, ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
డేటా సెంటర్ కు 2019కు ముందే మొదట ప్రస్తావన జరిగిందని, ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క అని ఇప్పటి నుంచి విశాఖ..డేటా ఎఐ హబ్ గా పిలుచుకోబోతున్నామని ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతుందని లోకేష్ పేర్కొన్నారు. వైజాగ్ లో జి అంటే గూగుల్ అనే శబ్దం మార్మోగబోతోందని ఐదేళ్లలో విధ్వంస పాలన చూశామని అన్నారు. పరిశ్రమలు ఎపికి రావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని, ఆ మూడు కారణాలు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్ అన్నారు. చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ తో ప్రయోజనాలు చూపిస్తున్నామని చెప్పారు. నమో కు కొత్త అర్థం చెబుతున్నానని, నమో అంటే నాయుడు, మోడీ అని అన్నారు. పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోందని లోకేష్ కొనియాడారు.














