హోర్సెన్స్(డెన్మార్క్): థామస్ కప్‌లో భాగంగా చైనాతో జరిగిన చివరి రౌండ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడా, ఆస్ట్రేలియాలతో జరిగిన తొలి రెండు టీమ్ విభాగం మ్యాచుల్లో గెలిచిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అయితే చైనాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు ఓటమి తప్పలేదు. చైనా 3-2 తేడాతో భారత్‌ను ఓడించింది. తొలి సింగిల్స్‌లో లక్షసేన్ 19-21, 21-8, 12-21 తేడాతో లి ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తర్వాత జరిగిన డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ శెట్టి జంట పరాజయం చవిచూసింది.

లియాంగ్‌వాంగ్ చాంగ్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ జంట 13-21, 21-13, 24-26తో ఓడిపోయింది. కాగా, తర్వాత జరిగిన సింగిల్స్‌లో యువ సంచలం ఆయుశ్ శెట్టి విజయం సాధించాడు. వెంగ్ హాంగ్‌తో జరిగిన పోరులో ఆయుశ్ 17-21, 21-13, 21-15తో జయకేతం ఎగుర వేశాడు. అయితే కీలకమైన పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌ఎంఆర్ అర్జున్ జోడీ ఓటమి పాలైంది. జిటింగ్‌రెన్ జియాంగ్ జంటతో జరిగిన పోరులో వీరికి ఓటమి ఎదురైంది. ఇక చివరగా జరిగిన సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. లు గువాంగ్‌తో జరిగిన పోరులో ప్రణయ్ 20-22, 21-19, 21-11తో జయభేరి మోగించాడు.