ఒక రోడ్డు ప్రమాదం… ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కానీ అదే విషాదంలో తీసుకున్న ఒక నిర్ణయం… ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల సత్యనారాయణ జీవితం విషాదాంతమైంది. తన గ్రామానికి చెందిన షరీఫ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై పనిమీద వెళ్తుండగా, సదాశివపేట సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
రక్తపు మడుగులో పడ్డ ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రెండు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడినా… చివరకు సత్యనారాయణ బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కుటుంబానికి అది పిడుగుపాటు వార్తగా మారింది. ఇంటికి అండగా ఉన్న వ్యక్తి ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అయితే… అంతటి దుఃఖంలోనూ వారు తీసుకున్న నిర్ణయం అందరి హృదయాలను కదిలించింది. “మా మనిషి ప్రాణాలు నిలవకపోయినా… ఇంకొంతమందికి జీవం ఇవ్వాలి” అని భావించిన కుటుంబ సభ్యులు సత్యనారాయణ అవయవాలను దానం చేయాలని ముందుకు వచ్చారు. ఆయన నుంచి సేకరించిన కీలక అవయవాలను ప్రాణాపాయంలో ఉన్న ఐదుగురు రోగులకు విజయవంతంగా అమర్చారు వైద్యులు. ఒకరి మరణం… ఐదుగురికి పునర్జన్మగా మారింది.
మరణంలోనూ మహాదాతగా నిలిచిన సత్యనారాయణకు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కంటతడి మధ్య ఘన నివాళి అర్పించారు. హార్ట్ టచింగ్ విజువల్స్ మధ్య ఆయనకు చివరి వీడ్కోలు పలికారు. సత్యనారాయణ భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపోయినా…
తన అవయవాలతో ఐదుగురి శరీరాల్లో, వారి నవ్వుల్లో, వారి కొత్త జీవితాల్లో చిరస్థాయిగా జీవిస్తూనే ఉంటాడు.












