
సౌదీ అరేబియాలోని దమ్మామ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని సోమవారంనాడు అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలోని వాష్‌రూమ్‌లో ‘బాంబు’ ఉందంటూ రాసిన టిష్యూ పేపర్‌ను సిబ్బంది గుర్తించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు సందేశం గుర్తించడంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని మళ్లించాలని పైలెట్లు నిర్ణయించుకున్నారని, సాయంత్రం 4.30 గంటల సమయంలో
అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని ‘జీ’ డివిజన్ ఏసీపీ వీఎన్ యాదవ్ తెలిపారు. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారని, ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని చెప్పారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు వివరించారు. ఘనటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. కాగా, అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత విమానాన్నితిరిగి కార్యకాలాపాలకు అనుమతిస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.











