హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు విశ్వరూపం చూపిస్త్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. మండిపోతున్న ఎండల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో మనకు పగటి పూట చుక్కలు కనిపిస్తాయి. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి. మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఎలా ఉంటుందో తెలిస్తేనే భయం వేస్తోంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

సోమవారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజు వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఇతర జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. వడదెబ్బతో మంచిర్యాల జిల్లాలో భోగారపు మారయ్య(56), పెద్దపల్లి జిల్లాలో దశరథం సౌమ్య(19), నారాయణ పేటలో వృద్ధుడు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో రంగు జంగయ్య(51) వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడి దుర్మరణం చెందాడు. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం, మజ్జిగా, పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు, నిమ్మరసం, రాగిజావ, ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉండి, కొంత ఉపశమనం లభిస్తుంది.