ఖాట్మండూ: పశ్చిమ బెంగాల్‌లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) పెట్రోలింగ్ బృందం ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి రూ.17.40 కోట్ల విలువైన స్మగుల్ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. నదియా జిల్లాలోని హల్దార్‌పోరా పోస్టు సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ 32వ బెటాలియన్ భద్రతా విధులు నిర్వహిస్తోంది.

బంగ్లాదేశ్ జాతీయుడి నుంచి 89 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని, వాటి బరువు 11.28 కిలోలకు పైగా ఉందని అధికారులు చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని బీఎస్‌ఎఫ్ అధికారులు డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం, సరిహద్దు నేరాలకు అరికట్టెందుకు ఈ బెటాలియన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 2023 ఆగస్టు నుంచి ఇంతవరకూ 120 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుంది.