కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ నవంబరు 10న భారత్‌లో విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో దేశీయ ప్రచురణపై కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. వాస్తవానికి ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (పీఆర్‌హెచ్‌ఐ) ప్రచురించాల్సి ఉంది. అయితే పుస్తకంలోని కొన్ని అంశాలపై రచయిత ప్రతినిధులకు, ప్రచురణ సంస్థకు మధ్య సంపాదకీయం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ సంస్థ ప్రచురణ నుంచి తప్పుకుంది.మన కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ ఆత్మకథల్లో ఇది ఒకటి. ప్రేమ, గుర్తింపు, బాధ్యత, అనుబంధం వంటి అంశాలను అత్యంత వ్యక్తిగత కోణంలో ఆవిష్కరించే ఈ రచన.. భారత్‌లో సాగిన ప్రస్థానాన్ని లోపలి నుంచి చూసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది” అని హార్పర్ కాలిన్స్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.


పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మొదట ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు ఆసక్తి చూపింది. అయితే మాన్యుస్క్రిప్ట్‌లోని కొన్ని అంశాలపై మార్పులు చేయాలన్న ప్రతిపాదనల విషయంలో రచయిత ప్రతినిధులతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. దీంతో చివరకు పుస్తక ప్రచురణ నుంచి తప్పుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ పరిణామాలపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ప్రభుత్వ ఒత్తిడి, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, మోదీ ప్రభుత్వ హయాంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిన అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను తొలగించేందుకు పెంగ్విన్‌పై ఒత్తిడి వచ్చిందని కొందరు ఆరోపించారు. అయితే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తమపై ఎలాంటి బాహ్య ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. గత వారం పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ప్రకటనలో.. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నామని, దాని ప్రచురణ హక్కులను సాధించడం తమకు ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారమని తెలిపింది.

అయితే ఒక నిర్దిష్ట అంశంపై రచయిత, ప్రతినిధులతో అవగాహన కుదరకపోవడంతో ప్రచురణ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించింది. రచయితతో జరిగిన చర్చల్లో కొన్ని మార్పులకు తాము అంగీకరించామని, మరికొన్ని అంశాల్లో రచయిత అభిప్రాయాన్ని గౌరవించామని సంస్థ తెలిపింది. అయితే చివరకు ఒక అంశంపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొంది. గోప్యతా నిబంధనలు, రచయితతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆ అంశం ఏమిటో వెల్లడించలేమని స్పష్టం చేసింది.హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణతో ఈ పుస్తకం నవంబరు 10న అంతర్జాతీయ విడుదలతో పాటు భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయంగా దీనిని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్‌కు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ ప్రచురిస్తోంది. ‘బిలాంగింగ్’లో సోనియా గాంధీ తన బాల్యాన్ని ఇటలీలోని యుద్ధానంతర వెనెటో ప్రాంతం నుంచి ప్రారంభించి.. అనంతరం కేంబ్రిడ్జ్ వరకు సాగిన తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. 1965లో అక్కడే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీని కలుసుకున్న సందర్భాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

రాజీవ్ గాంధీతో వివాహం, అత్త అయిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పరిచయం, భారత్‌కు వచ్చిన తర్వాత ఇక్కడి జీవనశైలికి అలవాటు పడిన తీరు ఈ ఆత్మకథలో ఉన్నాయి. విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య వంటి విషాద ఘటనలను సోనియా గాంధీ ప్రస్తావించారు. 2004 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం సాధించిన సందర్భం, సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా పార్టీ, కూటమికి నాయకత్వం వహించిన తీరు కూడా ఆత్మకథలో కీలకంగా ఉంది.