
భారం మోసేది మనం కాకపోతే ఒడ్డున కూర్చుని ఎన్ని సుద్దులైన చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహారం కూడా అలాగే ఉంది. మూడో బిడ్డని కంటే 30 వేలు, నాలుగో బిడ్డని కంటే 40 వేలు ఇస్తారట. మరి ఒక్కసారి ఇచ్చే డబ్బులతో పాతికేళ్లు ఎలా పోషించాలి? అవసరమైతే తర్వాత కూడా పోషించాల్సి వస్తుందేమో. 30, 40 వేలతో ఎవరైనా ఎంతకాలం పోషించగలుగుతారు? ఇది ఏ రకమైన తర్కానికి అందడం లేదు. భారతదేశంలోని అరుదైన ఆర్థికవేత్తలలో తాను ఒకడినని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటాడు, చెప్పించుకుంటాడు. అసలు మోడీ, మన్మోహన్ ప్రభుత్వాలే కాక ప్రపంచంలోని చాలా దేశాలు తన ఆర్థిక సలహాలు విధానాలు పాటిస్తాయని సగర్వంగా ప్రకటిస్తాడు. ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా సమస్యతో బాధపడుతుంటే మన ఆర్థికవేత్త ఆంధ్ర ప్రజలు ముగ్గురిని నలుగురిని కనమని సలహాలిస్తున్నాడు. అందుకు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాడు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకున్న సందర్భంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావడం దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు కొత్తగా కలుస్తున్నాయన్న బాధ ఆయనలో ఎక్కువగా ఉంది. సహజంగానే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ఎక్కువ.
అక్కడ రాష్ట్రాలు ఎక్కువ. జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేయడం అన్యాయమని బాబు ఘోష. దక్షిణాది రాష్ట్రాలు గతంలో పకడ్బందీగా కుటుంబ నియంత్రణ విధానం పాటించడంతో అక్కడి జనాభా నియంత్రణ లోనికి వచ్చిందనేది ఆయన వాదన. నిజమే అందుకోసం లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు కోసం పిల్లలను కనాలా? ఇందులో కూడా రాజకీయమేనా? ఉత్తరాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాన్ని పట్టించుకోకపోవడం వల్ల వారి జనాభా పెరిగింది అనేది కూడా ఇందులోని వాదన. అది నిజంగా నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతగానే భావించాలి. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో తమ పార్టీ భాగస్వామిగా ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏ రకంగానూ ఒప్పించలేక, బెదిరించలేక ఒక అసక్తతతో ఇచ్చిన ప్రకటన ఇది. జనాభా పెరిగితే మానవ వనరులు పెరుగుతాయి. నిజమే కానీ సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోతుండడం బాబుకి తెలియదా? ఆయన ఇచ్చే సొమ్ముకు ఆశపడి పిల్లల్ని కంటే వారి భవిష్యత్తు ఏమవుతుంది? ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూమిని వేలాది ఎకరాలు రాజధాని పేరుతో లాక్కున్నాడు. భూమి కోల్పోయిన వారి పరిస్థితి ఎప్పటికీ అగమ్యగోచరమే. కానీ బాబు ఇలాంటివి పట్టించుకోరు. తనకు ఓట్లు, సీట్లు కావాలి. ప్రజల బాధలు ఆయనకు ఏనాడు పట్టవు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచిస్తాడు. కానీ ప్రతి ప్రసంగంలోనూ రాజకీయాలతో కలిసికట్టుగా అభివృద్ధి సాధిద్దాం అంటూ సుద్దులు బోధిస్తాడు.
తనకు తాను గొప్ప దార్శనికుడిగా అభివర్ణించుకునే చంద్రబాబు మహిళలను తన వ్యాఖ్యలతో కించపరిచినట్టే లెక్క. పిల్లలు ఎంతమంది కావాలి, వారి కుటుంబ స్తోమత ఇవన్నీ ఆ కుటుంబ యజమాని, యజమానురాలిపై వారి ఆలోచనలపై, నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. పిల్లల్ని తమ కోసం కంటారు. అంతేకానీ ముఖ్యమంత్రి కోసమో లేక లోక్‌సభ సీట్ల పెంపు కోసమో కనరు కదా. మహిళలను సంతానోత్పత్తి యంత్రాలుగా చూడడం చాలా నీచమైన విషయం. బాబు ఇచ్చే 30 40 వేల కోసం భర్తలు గాని అత్తమామలు కానీ మహిళలపై సంతానం కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అందువల్ల గృహ హింస కూడా పెరగవచ్చు. అది కుటుంబాలలో విపత్కర పరిణామాలకు కూడా దారి తీయవచ్చు. పోషణ ఖర్చులు ముఖ్యంగా విద్య, వైద్యం విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఎక్కువ సంతానాన్ని కనమని అందుకు తను ప్రోత్సాహకాలు ఇస్తాననడం బాబుకి మాత్రమే చెల్లింది. ఒకపక్క ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రానున్నది గడ్డుకాలమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొదుపు మాత్రం పటించడం మొదలుపెట్టారు ప్రధాని మోడీ. మరి చంద్రబాబు ప్రకటన మోడీ విధానాలకు విరుద్ధం కాదా? మహిళా స్వేచ్ఛకు భంగకరం కాదా? ఆయన కోసం కుటుంబాలు రోడ్డున పడాలా? ఇది ఏ రకమైన దార్శనికత అనుకోవాలో సగటు భారతీయుడికి అర్థం కావడం లేదు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రజల్లో సమస్యలు చర్చకు వచ్చినప్పుడు ప్రశ్నించడం మొదలైనప్పుడు చంద్రబాబు చాలా తెలివిగా విషయాన్ని పక్కదారి పట్టిస్తాడు. సూపర్ సిక్స్ హామీల గురించి మహిళలకు గతంలో ప్రకటించిన నెలవారి డబ్బు పథకాల గురించి ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వెంటనే తన అమ్ములపొదిలో నుండి ఒక నూతన అస్త్రాన్ని జనం మీదికి వదిలాడు.
అప్పులు రాష్ట్రానికి పెనుభారం అవుతున్న పరిస్థితి. ఉన్న పథకాలు కొనసాగించడమే గొప్ప. ఇక కొత్త పథకాలకు తావేది? ఇలాంటి పరిస్థితులలోనే చంద్రబాబు ప్రజల దృష్టిని ఆలోచనలను మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మంది బిడ్డలను కనండి అంటూ పిలుపునిచ్చాడు. దాని ఆచరణ తన కొడుకుతోనే మొదలు పెడితే బాగుంటుందని ప్రముఖులు వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. ఇద్దరు బిడ్డలను కనీ పెంచడానికి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో చంద్రబాబు ప్రకటన కుటుంబాలను మరింత అప్పుల ఊబిలో దించేదే. సంతాన వృద్ధితో సంపద సృష్టి జరిగితే ఈపాటికి ప్రపంచ దేశాలన్నీ ఆ విధానాన్ని ఎప్పుడో పాటించేవి ఇది కేవలం నాయుడు అజ్ఞానాన్ని మాత్రమే బహిర్గత పరుస్తున్నది. ‘సోమ, మంగళ, బుధ ... వీడికి పేరేది? పుట్టే వాడికి చోటేది?’ అన్న పాత సినిమా పాట ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నది.
- శ్రీ శ్రీ కుమార్













