
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి అందాల పోటీల నిర్వహణ, ఫుట్ బాల్ పోటీల నిర్వహణ చేసుకోవడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై సిఎం ఇంతవరకు ఒక్క రివ్యూ చెయ్యలేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చెయ్యండి అని రైతులు వేడుకుంటున్నారని, ఎండ తీవ్రతకు ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం 50 శాతం కల్లాలోనే ఉందని, అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొక్క జొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం వరి ధాన్యం కొనుగోలు అంశం అని, ధాన్యం కొనుగోలు అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చనే లేదని అన్నారు. వరి ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, క్వింటాల్‌కు 250 రూపాయలు రైతు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 250 రూపాయలు ఆర్‌ఆర్ ట్యాక్స్‌గా పరిగణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఘోరంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ రైతులను మోసం చేశారని అన్నారు. కెసిఆర్ హయాంలో రైతులకు రైతుబంధు పంటకు పంటకు వస్తుండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రైతు భరోసా ఇచ్చే దిక్కులేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏనాడు కరీంనగర్ రాలేదు, ధాన్యం కొనుగోలుపై రివ్యూ చెయ్యలేదని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు పూర్తిగా విఫలం అయ్యారని, వారు హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఇంచార్జ్ మంత్రులు కల్లాల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. మరణించిన రైతులకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, మే 31లోపు రాష్ట్రంలో ఉన్న వరి ధాన్యం మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయలని డిమాండ్ చేశారు.













