అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు. లోక్ భవన్‌కు వెళ్లిన హిమంత బిశ్వశర్మ తన కేబినెట్ సహచరులతో కలిసి రాజీనామా చేశారు. సిఎం కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్టు చేసింది. రాజీనామాను ఆమోదించి, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకూ శర్మను తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరినట్లు వెల్లడించింది. రాజీనామా అనంతరం లోక్ భవన్ వెలుపల మీడియాతో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.

మే 11 తర్వాత ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో జరిగే బిజెపి శాసనసభ పక్ష సమావేశంలో కొత్త సీఎంని ఎంపిక చేస్తారని శర్మ తెలిపారు. కాగా, 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.