
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటుంది. విభిన్న అభిప్రాయాలు, ప్రశ్నించే సంసృ్కతి, ప్రజల నిర్భయ భాగస్వామ్యం.. ఇవే దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులుగా నిలిచాయి. జర్నలిస్టులు ప్రభుత్వాలను ప్రశ్నించారు, కార్యకర్తలు వ్యవస్థలను సవాలు చేశారు, విద్యార్థులు అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. రాజ్యాంగ స్వేచ్ఛలకు న్యాయస్థానాలు కాపలాదారులుగా నిలిచాయి. భిన్నాభిప్రాయాన్ని ప్రజాస్వామ్య బలహీనతగా కాదు, దాన్ని గొప్ప బలంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది. భయం, అసహనం, విమర్శలను అణచివేయాలనే ధోరణి ప్రజాస్వామ్య వాతావరణాన్ని కమ్మేస్తున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువత, ఆర్‌టిఐ కార్యకర్తలు, మీడియా వర్గాలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తర్వాత ఆయన వివరణ ఇచ్చినా, బొద్దింకలు, పరాన్నజీవులు వంటి పదాలతో కొంతమందిని పోల్చడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎందుకంటే అవి కేవలం ఒక వ్యాఖ్యగా కాకుండా, విమర్శలను అనుమానంతో చూసి పెరుగుతున్న మనస్తత్వానికి ప్రతిబింబంగా కనిపించాయి.
సమస్య ఒక్క వ్యాఖ్యతో ముగిసిపోదు. విమర్శనే అసహ్యంగా భావించే వాతావరణం పెరుగుతుండటమే అసలు సమస్య.
దేశవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిని తరచుగా దేశద్రోహులు, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసేవారు, వ్యవస్థను దెబ్బతీయాలనుకునేవారు అంటూ ముద్రవేస్తున్నారు. అసౌకర్యకరమైన నిజాలను బయటపెట్టే జర్నలిస్టులు ఆన్‌లైన్ దాడులకు గురవుతున్నారు. స్వతంత్ర మీడియా సంస్థలు ఆర్థిక, న్యాయపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. మానవహక్కుల కార్యకర్తలను దేశ స్థిరత్వానికి ముప్పుగా చిత్రీకరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై దర్యాప్తు సంస్థల చర్యలు రాజకీయ కక్షసాధింపులుగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. నిరుద్యోగం, సామాజిక అన్యాయం వంటి అంశాలపై నిరసన తెలిపే విద్యార్థులను ప్రజాస్వామ్య హక్కులు వినియోగిస్తున్న పౌరులుగా కాకుండా, శత్రువుల్లా చూడడం పెరుగుతోంది. ఈ ధోరణి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంధ విధేయతతో కాదు, విమర్శలతోనే బలపడుతుంది. ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కు. ప్రజాసంస్థలు ఎప్పటికప్పుడు జవాబుదారీతనంతో ఉండాలి.
పౌరులు పాలకుల కింద జీవించే ప్రజలు కాదు; పాలనలో భాగస్వాములు. కానీ విమర్శ అధికారాన్ని అసహనానికి గురిచేయడం ప్రారంభించినప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాదకర దశలోకి ప్రవేశిస్తుంది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత స్థానం పడిపోవడం పట్ల అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. భారత ప్రభుత్వం ఈ నివేదికలను పక్షపాతపూరితమైనవిగా, తప్పుదోవ పట్టించేవిగా కొట్టిపారేసింది. అయి తే అసలు ఆందోళన కలిగించేది ఒక నివేదికను తిరస్కరించడం కాదు; సంవత్సరాలుగా పెరుగుతున్న విస్తృత ధోరణి. ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మకంగా వచ్చే ఏ నివేదికనైనా అది మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య క్షీణత, నిరుద్యోగం, మైనారిటీ హక్కులు లేదా ఆర్థిక పరిస్థితులగురించి అయినా వెంటనే దాన్నిప్రచార యుద్ధం, భారత్ వ్యతిరేక కథనం, విదేశీ జోక్యంగా కొట్టివేస్తున్నారు. సృజనాత్మక విమర్శలను ప్రజాస్వామ్యానికి అవసరమైన సూచనలుగా కాకుండా, దేశానికి వ్యతిరేక చర్యలుగా చూడడం పెరుగుతోంది.
ఈ రక్షణాత్మక రాజకీయ సంసృ్కతి ఒక ప్రమాదకర పరిస్థితిని సృష్టిస్తోంది. అక్కడ నిజం చెప్పడం కంటే మౌనం పాటించడమే సురక్షితంగా మారుతోంది. స్వతంత్ర జర్నలిజం బలహీనపడటం ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అనేక మీడియా సంస్థలు అధికారంలో ఉన్నవారిని కఠినమైన ప్రశ్నలు అడగడానికి వెనుకాడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైమ్‌టైమ్ టెలివిజన్ చర్చలు పరిశోధనాత్మక జర్నలిజం కంటే గట్టిగా వినిపించే జాతీయవాద నినాదాలతోనే ఎక్కువగా నిండి ఉంటున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, గ్రామీణ సంక్షోభం, ప్రజా సంస్థల జవాబుదారీతనం వంటి కీలక అంశాల కంటే సంచలనాత్మక రాజకీయ కథనాలకే అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ప్రకటనలు కోల్పోతామనే భయం, దాడులు, న్యాయపరమైన వేధింపులు ఎదురవుతాయనే ఆందోళనల కారణంగా మీడియా వర్గాల్లో స్వీయ నియంత్రణ (సెల్ఫ్-సెన్సార్‌షిప్) పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్భయంగా ప్రశ్నించే జర్నలిజం లేకుండా ప్రజాస్వామ్యం క్రమంగా తనను తాను సరిదిద్దుకునే శక్తిని కోల్పోతుంది.
ప్రధానమంత్రి స్వేచ్ఛాయుత మీడియా సమావేశాలకు దూరంగా ఉండటం కూడా ప్రజాస్వామ్య పారదర్శకత తగ్గుతోందనే ఆందోళనలకు బలం చేకూరుస్తోంది. ప్రపంచంలోని ప్రధాన ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాధినేతలు తరచుగా జర్నలిస్టుల కఠిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటారు. బహిరంగ మీడియా సమావేశాలను ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కీలక భాగంగా భావిస్తారు. కానీ భారత ప్రధానమంత్రి తన పదవీకాలంలో ఎక్కువగా స్వేచ్ఛాయుత ప్రెస్ కాన్ఫరెన్సులను నివారించారు. ప్రజలతో కమ్యూనికేషన్ కూడా పూర్తిగా నియంత్రిత, ముందస్తుగా ప్రణాళికాబద్ధమైన విధానంలోనే కొనసాగుతోంది. అసౌకర్యమైన ప్రజా ప్రశ్నలను ఎదుర్కొనే ఆసక్తి లేకపోవడానికే ఇది సంకేతమని విమర్శకులు అంటున్నారు. ఇటీవల ఒక నార్వేజియన్ జర్నలిస్టుతో జరిగిన వివాదం ఈ పరిస్థితిని స్పష్టంగా ప్రతిబింబించింది. ఆమె ప్రధానమంత్రిని నేరుగా ఒక ప్రశ్న అడిగినా, ఆ ప్రశ్నకు సమాధానం రాలేదు. జర్నలిస్టుగా తన వృత్తి బాధ్యతను నిర్వర్తించినందుకు అభినందించాల్సింది పోయి, సోషల్ మీడియాలో కొంతమంది ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేశారు. ఆమెను అవమానిస్తూ, దూషిస్తూ, దేశానికి వ్యతిరేకురాలిగా చిత్రీకరించారు. వాస్తవానికి, ప్రధానమంత్రి ప్రశాంతంగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఉంటే ఆయన ప్రజాస్వామ్య ప్రతిష్ఠ మరింత బలపడేది. బలమైన నాయకులు కఠినమైన ప్రశ్నల వల్ల బలహీనపడరు; వాటికి ధైర్యంగా సమాధానం ఇవ్వగల సామర్థ్యంతోనే మరింత బలపడతారు. కానీ ప్రశ్నించడం శత్రుత్వానికి కారణమైతే, అది దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు భయానక సంకేతాన్ని పంపుతుంది.
కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ ఏర్పడిన వివాదం కూడా ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. రాజకీయ వ్యంగ్యం ప్రజాస్వామ్యంలో ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలు తమ అసంతృప్తిని సృజనాత్మకంగా, శాంతియుతంగా వ్యక్తం చేయడానికి వ్యంగ్యం ఒక సాధనంగా నిలుస్తోంది. ఎమర్జెన్సీ కాలంలో పత్రికా కార్టూన్ల నుంచి నేటి డిజిటల్ హాస్యరూపాల వరకు, అధికారిక రాజకీయ వేదికలు మూసుకుపోయినట్టు అనిపించినప్పుడు వ్యంగ్యమే ప్రజా నిరసన భాషగా మారింది. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకు వచ్చిన విపరీతమైన ఆదరణ, దాని విమర్శలు, ప్రతీకాత్మక సందేశాలతో అనేక మంది యువ భారతీయులు అనుసంధానమయ్యారని సూచించింది. అలాంటి సందర్భంలో ఆ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం లేదా భారత్‌లో బ్లాక్ చేయడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. వ్యంగ్యాన్ని లేదా విమర్శలను అణచివేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడదు. తీవ్రమైన విమర్శలను కూడా పరిపక్వతతో భరించే ప్రభుత్వాల వల్లే ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుంది.
అయితే ఈ పరిస్థితిలో అత్యంత విషాదకరమైన అంశం దేశంలోని నిరుద్యోగ యువత పరిస్థితి. ఆర్థిక మార్పు, ఉద్యోగాల కల్పన పై పదేపదే హామీలు వచ్చినప్పటికీ, లక్షలాది చదువుకున్న యువకులు ఇప్పటికీ అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. నియామక ప్రక్రియలు అస్థిరంగా మారుతున్నాయి. అనేక రంగాల్లో అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి తక్కువగా ఉండటంతో, చదువుకున్న యువతలో నిరాశ, వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నిరుద్యోగ యువతపై నిర్లక్ష్యంగా లేదా తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలు మరింత బాధాకరంగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారి నుంచి ప్రజాస్వామ్యం కోరేది నిరాదరణ కాదు సహానుభూతి. భారతదేశం కూడా 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఇలాంటి ప్రజాస్వామ్య సంక్షోభాన్ని అనుభవించింది. ఆ సమయంలో పత్రికలపై నియంత్రణలు విధించారు. ప్రతిపక్ష నాయకులను జైలు కు పంపారు. పౌర స్వేచ్ఛలను నిలిపివేశారు. అప్పుడు కూడా ప్రజాస్వామ్య ప్రతిఘటన ముగిసిపోయిందని చాలామంది భావించారు.
కానీ 1977 ఎన్నికల్లో భారత ప్రజలు తమ ఓటుతో గట్టి సమాధానం ఇచ్చారు. నియంతృత్వ ధోరణులను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఓడించారు. స్వేచ్ఛకు ముప్పు ఏర్పడిందని భావించినప్పుడు భారతీయులు దానిని ఎంత విలువైనదిగా భావిస్తారో గుర్తుచేసే చారిత్రాత్మక అధ్యాయంగా అది ఇప్పటికీ నిలిచిపోయింది. విమర్శలను నేరంగా చూడడం, వ్యంగ్యానికి భయపడడం, జర్నలిస్టులను బెదిరించడం.. వంటివి కొనసాగితే ఏ ప్రజాస్వామ్యమూ ఆరోగ్యంగా నిలవదు. ప్రజా సంస్థలకు గౌరవం రావడం అనేది ప్రజల విశ్వాసంతో సాధ్యమవుతుంది కానీ; ప్రశ్నించలేని అధికారంతో కాదు. భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రభుత్వాలు కొంతకాలం శక్తివంతంగా కనిపించవచ్చు. కానీ భయంపై నిర్మితమైన రాజకీయ సంసృ్కతి చివరకు ప్రజాస్వామ్యపు పునాదులనే బలహీనపరుస్తుందని చరిత్ర పదేపదే నిరూపించింది. భారతదేశ మహత్తు ఎప్పుడూ బలవంతపు మౌనం వల్ల రాలేదు. నిర్భయ చర్చలు, భావజాల వైవిధ్యం, అధికారాన్ని ప్రశ్నించే సాధారణ ప్రజల ధైర్యం వల్లే వచ్చింది.
మహాత్మా గాంధీ నుంచి జయప్రకాశ్ నారాయణ్ వరకు భారత ప్రజాస్వామ్య ప్రయాణాన్ని నిర్మించినవారు, అధికారాన్ని ఆరాధించినవారు కాదు; అవసరమైనప్పుడు దాన్ని సవాలు చేసినవారు. ఒక దేశం అసలైన బలం అసౌకర్యమైన స్వరాలను అణచివేయడంలో కాదు వాటిని వినడంలో ఉంది. ఆత్మవిశ్వాసం ఉన్న ప్రజాస్వామ్యం ప్రశ్నలకు భయపడదు. ఆత్మవిశ్వాసం ఉన్న న్యాయవ్యవస్థ కష్టాల్లో ఉన్న పౌరులను అవమానించదు. ఆత్మవిశ్వాసం ఉన్న ప్రభుత్వం వ్యంగ్యాన్ని అణచివేయదు. అలాగే ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు మీడియాను దూరం పెట్టడు. ఈ రోజు భారతదేశం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా? లేక అసహనం, భయంతో దాన్ని బలహీనపరచాలా? అనే ప్రశ్న ముందుంది. ఈ ఎంపికను దేశం ఎంత నిజాయితీగా ఎదుర్కొంటుందో, భారత గణతంత్ర భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుంది.
గీతార్థ పాఠక్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)











