హైదరాబాద్: ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన ఫార్మా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అత్యంత దుర్మార్గమైన అవినీతి తతంగానికి తెరలేపిందని కెసిఆర్ దుయ్యబట్టారు.

ఈ సమస్యమీద ఉభయ సభల్లో ప్రశ్నించాలన్నారు. తెలంగాణ సిరుల వెలుగు సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చు మీరిందని, సింగరేణి కుంభకోణాలకు నెలవుగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ఉభయసభల్లో పార్టీ సభ్యులు ప్రశ్నించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రభుత్వ భూములను భవిష్యత్తు తరాల అవసరాలకు ఏమాత్రం మిగిల్చకుండా, తమ ఇష్టా రీతిన అక్రమ అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను నిలదీయాలని చెప్పారు.

సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని పోపడమే కాకుండా నిర్వహణ చేతగాని పరిస్థితిలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. ఇటువంటి నిర్ణయాల మీద ఉభయ సభల్లో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. గోదావరి కావేరి నదుల లింకు ప్రాజెక్టు పేరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టానికి ఒడిగడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉభయసభల్లో ప్రశ్నించాలని అన్నారు.