ప్రజలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రాజ్యం బాగుంటేనే ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇలా రాజ్యం, ప్రజలు విడదీయని బంధంగా చూస్తాం. మానవాళికి నాగరికతను అందించి, మనిషి మానసిక ఎదుగుదలతో పాటుగా, తోటివారితో నెరిపే సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో గొప్పగా చాటిచెప్పిన సంస్కృతి మనది. ఇలా ప్రపంచంలోనే ఎన్నో ప్రత్యేకతలకు నెలవు అయిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందుతున్న మన భారతదేశంలోనే బాలికలకు రక్షణ కరువైంది అని చెప్పడానికి మనస్సు అంగీకరించడం లేదు కానీ అదే నిజం. అందుకు దేశంలో బాలికలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచార సంఘటనలే నిదర్శనం. పిల్లలు, పెద్దలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సందిగ్ధ పరిస్థితి నేడు మన సమాజంలో కనబడుతోంది. అలాగే సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టేది మన వ్యక్తిత్వమే అని మరువకూడదు. అది మన ఆలోచనలు, ప్రవర్తన, నైతిక విలువలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తిత్వం ఇతరులతో ఎలా మసలుకోవాలో, ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలో, అవి ఒక మంచి సమాజానికి ఎంతగా ఉపయోగపడతాయో నేర్పిస్తుంది.

నిజాయితీ, నమ్మకం, బాధ్యత వంటి లక్షణాలు ఉన్న వ్యక్తిత్వం మన సమాజానికి ఇప్పుడు ఎంతైనా అవసరం. బాలికల సంరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు అది మనందరి కర్తవ్యం కావాలి. అది కాకుండా ఆడపిల్లల రక్షణ మరిచి మనలోని మనిషిని చంపి, పసిమొగ్గలను చిదిమే మృగ సంస్కృతికి బీజం వేయడం మానవ జాతికే కళంకం లాంటిది. దేవ భూమిగా పేరుగాంచిన మన నేలపై జరుగుతున్న అకృత్యాలు, పసిబిడ్డలపై పెరుగుతున్న మానభంగాల పర్వానికి సంబంధించిన గణాంకాలు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. ఈ సందర్భంగా ఒలింపియన్, భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మాకు భద్రత, రక్షణ లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న మహిళల భద్రతపై అనుమానాలను రేకెత్తించడంతోపాటు తీవ్రమైన చర్చకు దారితీసిందని చెప్పాలి. అంటే మహిళలు ఏ స్థాయిలో ఉన్నా అక్కడ వేధింపులకు గురవుతూనే ఉన్నారని అర్థమవుతుంది. ఇక ప్రత్యేకించి చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పాలంటే పల్లెటూరు సమాజంలో కంటే పాశ్చాత్య పోకడలు కలిగిన పట్టణాల్లోనే ఎక్కువగా ఉండటం ఆలోచించాల్సిన విషయం.

బాలికల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న నేరాల్లో 69,191 కేసులు (సుమారు 37%)కేవలం పోక్సో పరిధిలో నమోదు అవడం, దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలపై జరిగే నేరాలు అత్యధికం కావడం ఆందోళన కలిగించేదే. జాతీయ నేర నమోదు బ్యూరో 2024 నివేదికలోని గణాంకాలు నమ్మలేకుండా ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తోపాటు దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో చిన్నారులపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 1,77,335 కేసులు నమోద వగా, 2024లో ఆ సంఖ్య 1,87,702 కేసులుగా నమోదయ్యాయి. అంటే 5.9% అధికం అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా నమోదవుతున్న చిన్నారుల అపహరణ కేసులు 75,108 అంటే 40 శాతంగా ఉన్నాయి. ఇక బాల కార్మికులు, పదికందులను వదిలించుకునే ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం.

మనస్సును దహించేసే మరో విషయం ఏంటంటే 2021 నవంబర్‌లో పిల్లలు సరిగా చదవడం లేదని తమిళనాడులోని శివగంగై జిల్లా కారేకుడి ప్రాంతానికి చెందిన రామకృష్ణన్ అనే ఒక జోతిష్యుడి దగ్గరికి తమ 15, 17 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు చిన్నారులను తీసుకెళితే, వారికి దోషం పోగొట్టాలని నమ్మబలికి పిల్లలు ఇద్దరినీ గదిలో బంధించి అత్యాచారం చేసిన ప్రబుద్ధుడిపై కేసు నమోదు కాగా, విచారించిన శివగంగై పోక్సో కోర్టు రూ. రెండు లక్షల జరిమానా తోపాటు 200 సంవత్సరాల జైలుశిక్ష విధించడం సంతోషించదగ్గ పరిణామం. ఈ తీర్పు పసిపిల్లల వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా వెన్నులో వణుకుపుట్టేలా చేసేదే అని చెప్పాలి. మన హిందూ సాంప్రదాయాలు, మతాచారాలు, సంస్కృతి, శాస్త్రాలు గొప్పవే కానీ దేనిపైనా అంధవిశ్వాసం మంచిది కాదని ఈ ఘటన రుజువు చేస్తోంది.

ఇక తెలంగాణలో నమోదు అవుతున్న పోక్సో కేసుల సంఖ్య జాతీయ సగటు కన్నా తక్కువే అయినా, 2,103 కేసులు నమోదైనట్టు ఎన్‌సిఆర్‌బి నివేదిక చెబుతుండగా ఇందులో తీవ్రమైన లైంగిక దాడికి గురైన కేసుల్లో 98 శాతం బాలికలు కాగా, మిగతావి మగ పిల్లలపై జరిగిన లైంగిక దాడి కేసులు కావడం విశేషం. బాలికలపై దాడులు, లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ ద్వారా అసభ్యకర వేధింపులు లాంటి సంఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారాయి. విశేషం ఏంటంటే నమోదు అవుతున్న పోక్సో కేసుల్లో 96.6 శాతం బాధితులకు పరిచయం ఉన్నవారు లేదా బంధువులు, ఇరుగుపొరుగు వారే కావడం గమనార్హం. ఇది సమాజంలోని మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా పరిగణించాలి. మహానగరం హైదరాబాద్‌లో పోక్సో, బాలల అపహరణ కేసులు నిత్యం నమోదవుంతుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 6 మంది చిన్నారులు అపహరణకు గురవుతున్నారని నివేదికలు చెపుతున్నాయి. వీరిలో బతుకుదెరువు కోసం పొట్టచేతపట్టుకొని పల్లెనుండి పట్టణ బాటపట్టిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే కిడ్నాప్, అత్యాచారాలకు గురికావడం శోచనీయం.

దేశంలో బాల, బాలికలపై నేరాలు పెరుగుతున్నా రాష్ట్రంలో సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థ, షీ టీమ్స్, భరోసా కేంద్రాల అండతో ప్రజలు కొంతవరకు చైతన్యం చెంది, ఎక్కడ, ఎవరి ద్వారా ఇబ్బంది కలిగినా ధైర్యంగా ఫిర్యాదు చేసే స్థితికి చేరడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. దీనివల్ల కేసులు గణనీయంగా నమోదవడం కూడా చూస్తుంటాం. ఏదేమైనా ముక్కుపచ్చలారని మైనర్ బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం అత్యంత బాధాకరం. బాలికలపై జరిగే అత్యాచార ఘటనల నిరోధానికి పాలకులు పోక్సో లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా, మనిషిగా మనలో మార్పు రానంత వరకు ఉపయోగం ఉండదు. ఒక సంఘంలో జీవిస్తున్న మనం తోటి వారి పట్ల ప్రేమపూర్వక హృదయంతో బాధ్యత గల పౌరులుగా నడుచుకోవాలి. బంధువులుగా, రక్తసంబంధికులుగా, పొరుగు వారి శ్రేయస్సును కోరుకున్ననాడు ఒక మంచి సమాజాన్ని నిర్మించిన పరిపూర్ణమైన మనుషులుగా మిగిలిపోతాం. 

- ధీరన్ కొడారి

80082 00664