ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకరమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఒకటో, రెండో మ్యాచ్‌లు మినహా ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 43 పరుగులు చేశాడు. అంతేకాక.. ఒక సీజన్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.

అయితే ఇప్పుడు మరో రికార్డుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా వైభవ్ అవతరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైభవ్ 511 బంతుల్లో 99 సిక్సులు బాదాడు. నిన్నటి మ్యాచ్‌లో మరో సిక్సు కొట్టి ఉంటే.. వైభవ్ ఈ రికార్డును బద్దలుకొట్టేవాడు. కానీ, అలా జరగలేదు. దీంతో మే 1న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ రికార్డు కిరాన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. మరి వైభవ్ ఎన్ని బంతుల్లో ఈ రికార్డు సాధిస్తాడో తెలియాలంటే.. మే 1వరకూ వేచి చూడాల్సిందే.