అమరావతి: తల్లి, కుమారుడు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పాలకొల్లులో బండారు లక్ష్మీలహరి అనే మహిళ  ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది. ఆమె కుమారుడు విజయ్ పదో తరగతి చదువతుండడంతో తాను పదో తరగతి పరీక్షలు రాస్తానని కుటుంబ సభ్యులకు తెలిపింది. చదువుపై మమకారంతో ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాయడానికి సిద్ధపడింది. కుమారుడు విజయ్‌ తో కలిసి పదో తరగతి పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది. పదో తరగతి పరీక్షలకు కుమారుడితో కలిసి తల్లి హాజరైంది. పదో తరగతి ఫలితాలలో కుమారుడు 562/600, తల్లి 360/500 మార్కులు రావడంతో వాళ్ల ఆనంద భాష్పలకు అవధులు లేకుండా పోయాయి. రిజల్ట్స్ చూసుకొని తల్లీకొడుకులు మురిసిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత పుస్తకం పట్టి విజయం సాధించిన తల్లిని పలువురు అభినందిస్తున్నారు.