33 స్థానానికి పడిపోయిన రాజధాని నగరం

89.23 శాతం ఉత్తీర్ణతబాలికలదే పైచేయి

మనతెలంగాణ/ నాంపల్లి : పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 89.23 శాతం ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో 33 వ స్థానానికి దిగజారింది. జిల్లాలో మొత్తం 74099 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఇందులో బాలురు36,254 మంది, బాలికలు 37845 మంది ఉన్నారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 66,115(89.23 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 31524(86.95శాతం) మంది, బాలికలు 34,591(91.4శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

చిన్న జిల్లా ములుగు 99.30 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలివగా, రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లా 33(చివరి)వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ప్రభుత్వ స్కూళ్లలో బాలురు 2,645 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులుకాగా, 633 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. బాలికలు 3,906 మంది పరీక్షలు రాయగా 574 మంది బాలికలు పరీక్షల్లో తప్పారు. ఇందులో కూడా ఉత్తీర్ణతలో బాలికలే పై చేయిగా కనిపిస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల విషయానికి వస్తే బాలుర 26,373 మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 26,341 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,890 మంది ఫెయిల్ కాగా.. బాలికలు మాత్రం 2458 మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు.