
సుప్రీం కోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ కొరియన్ జోసెఫ్ 2018 జనవరిలో ఒక అసాధారణ, చారిత్రక చర్యగా పత్రికా గోష్ఠి నిర్వహించి ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అని దేశ ప్రజలను హెచ్చరించారు. ఆనాటి అత్యున్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు నేరుగాను, లిఖితపూర్వకంగానూ మొరపెట్టుకున్నా ప్రయోజనం లేక ఈ అసాధారణ చర్యకు పూనుకున్నట్టు ఆ నలుగురు న్యాయమూర్తులు మీడియా ద్వారా ఆనాడే దేశానికి బహిరంగపరిచారు. అయినా పరిస్థితిని చక్కదిద్దడానికి ఎవరూ పూనుకున్నట్టు లేదు. ఆనాటి తమ బహిరంగ ప్రకటనలో జస్టిస్ చలమేశ్వర్ తదితర న్యాయమూర్తులు ‘ప్రజాస్వామ్యం బ్రతికి బట్ట కట్టాలంటే, ఒక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సుస్థిరం చేయాలంటే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ అవసరం’ అన్నారు.
ఇంకొక మంచి మాట కూడా వారు దేశాన్ని ఉద్దేశించి చెప్పారు. ‘న్యాయ వ్యవస్థను రక్షించుకోండి.. తద్వారా దేశాన్ని రక్షించుకోండి. మేం ఇవాళ ఈ చర్యకు పూనుకోకపోయి ఉంటే ఓ 20 ఏళ్ల తర్వాత దేశంలోని కొందరు విజ్ఞులు మా నలుగురిని ఆత్మలు అమ్ముకున్నామని నిందించే అవకాశం ఉంది’ అన్నారు. ఆ నలుగురూ ఇలా చెప్పి 20 ఏళ్లు గడవకముందే దేశంలో న్యాయవ్యవస్థ ముందెన్నడూ లేనంతగా ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. రెండేళ్ల క్రితం జస్టిస్ వైవి చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కాలంలో సుప్రీం కోర్టు ఆవరణలో న్యాయదేవత కళ్ళగంతలు తొలగించి ఆమె చేతిలో ఖడ్గం బదులు రాజ్యాంగ ప్రతిని ఉంచిన మార్పు మినహాయిస్తే చలమేశ్వర్ తదితరులు కోరిన మార్పేదీ న్యాయవ్యవస్థలో వచ్చినట్టు కనపడకపోగా పరిస్థితులు మరింత దిగజారినట్టున్నాయి.
ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మీద ప్రజలు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. పార్లమెంట్ సజావుగా జరగదు, క్షణాలలో ఏ చర్చా లేకుండా, ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండా బిల్లులు పాస్ అయిపోతాయి. సాక్షాత్తూ ప్రధాన మంత్రి, మరో కీలక బాధ్యత నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి రోజుల తరబడి పార్లమెంటు ముఖం చూడరు. దళితుడైన కారణాన ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, సీనియర్ పార్లమెంటేరియన్ పాల్గొన్న సభాస్థలిని కొందరు శుద్ధి చేస్తే అడిగేవారు ఉండరు. ఆ విషయం ఆయన పెద్దల సభలో చెప్పుకుని రోదించే పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఈ దేశప్రజలు సహజంగానే ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో మరో ప్రధానమైన న్యాయవ్యవస్థ వైపే కదా చూస్తారు. ఇంతకాలం పవిత్ర గోవు (హోలీ కౌ) గా పరిగణించి, దానిమీద అత్యంత నమ్మకం ఉంచి తమకు అండగా నిలుస్తుందని న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం పెంచుకున్న ఈ దేశ ప్రజల దృష్టిలో ఆ వ్యవస్థ చులకన అయ్యే పరిస్థితి రావడం అత్యంత ప్రమాదకరం. అందుకే దాదాపు పదేళ్ళ క్రితమే జస్టిస్ చలమేశ్వర్ తదితరులు న్యాయవ్యవస్థను రక్షించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి అని తమ వంతు బాధ్యతగా దేశ ప్రజలను హెచ్చరించారు.
న్యాయవ్యవస్థలో నెలకొంటున్న పరిణామాలకు సుప్రసిద్ధ పాత్రికేయుడు పరంజయ్ గుహ తకుర్తా రచించిన ‘ఎ కాంట్రవర్షియల్ జడ్జి’ (ఒక వివాదాస్పద న్యాయమూర్తి) అన్న గ్రంథం అద్దం పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా జీవితం, ఆయన వెలువరించిన తీర్పులను గురించిన సవివరమైన కథనం ఈ గ్రంథం. ఇందులో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, సహారా కుంభకోణం వంటి అనేక వివాదాస్పద కేసులకు సంబంధించిన వివరాలను పరంజయ్ ఉదహరించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు మరో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉందంటున్న వైద్య కళాశాలల గుర్తింపు కుంభకోణం గురించి కూడా ఈ పుస్తకంలో వివరంగా రాశారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ యావజ్జీవ కారాగార శిక్షకు సంబంధించిన తీర్పు గురించి కూడా పరంజయ్ తన పుస్తకంలో ప్రస్తావించారు. భారత రాజకీయ యవనిక మీద అత్యంత ప్రభావం చూపిన జస్టిస్ మిశ్రా తీర్పుల పైన సమగ్ర విశ్లేషణ ఈ గ్రంథం. ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థను పలుచన చేసే మరో సంఘటన ఇటీవల ఢిల్లీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో వందల కోట్ల నల్లధనం బయటపడటం.
ఇదిలా ఉంటే యువతరం మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చినికి చినికి గాలివానగా మారి చివరికి రాజకీయ వ్యవస్థకు చుట్టుకుని అందులో నుండి బయటపడటానికి ప్రస్తుతం కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న వర్గం పడుతున్న పాట్లు అందరికీ తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపించడాన్ని ప్రస్తావించడం చర్చకు దారితీసింది. కొలీజియం నిర్ణయాల వెనుక గల కారణాలను వెల్లడించకపోవడం వల్ల న్యాయవ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని ఆయన బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. కొలీజియం నిర్ణయాలు పారదర్శకంగా లేకపోతే సమర్థులైన, నిజాయితీ గల న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుందని, ఎటువంటి అర్హత లేని వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి రావడంవల్ల వారు భవిష్యత్తులో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఒక వర్గం ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని, ప్రజలను చీమలుగా అభివర్ణించే వారు న్యాయ వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం ద్వారా జస్టిస్ భుయాన్ అన్యాపదేశంగానే అయినా ఇటీవల యువతరాన్ని కాక్రోచ్లు, పారసైట్లు అని అభివర్ణించిన జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించే అన్నారనే అభిప్రాయం జనంలోకి వెళ్ళింది. ఈ స్థితిలో తన వ్యాఖ్యల మీద జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చుకున్నా, తన ఉద్దేశం అది కాదని చెప్పినా పరిస్థితి మారకపోగా ఆయనను తమ సంస్థ స్నాతకోత్సవానికి ఆహ్వానించరాదన్న కొందరు హైదరాబాద్ నల్సార్ విద్యార్థుల విజ్ఞాపన మీద వివాదం చెలరేగడమే కాదు, ఏకంగా భారత బార్ కౌన్సిల్ అధ్యక్షుడికి ఆ సెగ తగిలే దాకా వెళ్ళింది.
నల్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధంగా ఏర్పడిన, స్వయం ప్రతిపత్తి గల జాతీయ న్యాయ వ్యవహారాల అధ్యయన పరిశోధనల అకాడమీ. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛాన్సలర్ గాను, ఒక న్యాయవిద్యాకోవిదుడు వైస్ ఛాన్సలర్ గాను ఉంటారు. అక్కడ చదువుకునే విద్యార్థుల్లో కొందరు తమ సంస్థ స్నాతకోత్సవానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రావడం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడం వారి రాజ్యాంగ హక్కు. వ్యవస్థలు మంచివే. వాటికి నాయకత్వం వహించే, అజమాయిషీ చేసే వ్యక్తులు సమర్థులు కాకపోతే వాటికి చెడ్డపేరు రావటమే కాదు, తద్వారా చెలరేగే విపరిణామాలు సమాజానికి చేటు చేసేవిగా ఉంటాయన్న వాస్తవాన్ని నల్సార్ విద్యార్థులమీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మనన్ కుమార్ మిశ్రా తీసుకున్న దుందుడుకు నిర్ణయం మరోసారి రుజువు చేసింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నల్సార్ 2026 బ్యాచ్ న్యాయశాస్త్ర విద్యార్థులు ఎవరినీ నమోదు చేసుకోవద్దని దేశవ్యాప్తంగా ఉన్న బార్ కౌన్సిళ్లకు మనన్ కుమార్ మిశ్రా గత గురువారం లేఖ రాశారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అతిథిగా రావడం పట్ల కొందరు నల్సార్ విద్యార్థులు విముఖత ప్రదర్శిస్తూ లేఖ రాయడమే అందుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. మనన్ కుమార్ మిశ్రా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల నల్సార్ లో న్యాయవిద్య ముగించుకున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరూ న్యాయవాద వృత్తి చేపట్టడానికి వీలు లేకుండా పోతుంది. ఒక వ్యక్తి తమ సంస్థ స్నాతకోత్సవానికి అతిథిగా రావడాన్ని వ్యతిరేకించే హక్కు విద్యార్థులకు రాజ్యాంగం ప్రసాదించింది. ఒకవేళ వారి నిర్ణయం తప్పే అయినా కొందరు తీసుకున్న నిర్ణయానికి మొత్తం విద్యార్థులందరూ ఎందుకు శిక్ష అనుభవించాలి? మనన్ కుమార్ మిశ్రా భారతీయ జనతా పార్టీ తరఫున బీహార్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది. ఆయన 12 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగడాన్ని పలువురు సుప్రీం కోర్టు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవీకాలం రెండేళ్లే. అయితే చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ఆయన ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చారని, ఆయన నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆక్షేపించారు. కేరళ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బార్ కౌన్సిల్ సభ్యుడు, న్యాయవాది మనోజ్ కుమార్, కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఇద్దరూ మిశ్రా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కాగా ఈ సమస్య తమ పరిధిలో ఉందో లేదో పరిశీలించవలసి ఉందని, తమ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై తగు నిర్ణయం తీసుకుంటుందని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ స్పష్టం చేశారు. చివరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా ‘ఇది విద్యార్థులకు, నాకు మధ్య వ్యవహారం. బార్ కౌన్సిల్ కి ఏం సంబంధం?’ అని తీవ్రంగా స్పందించడంతో రాజు కన్నా తానే విధేయుడనని నిరూపించుకోబోయిన బిజెపి రాజ్యసభ సభ్యుడు మనన్ కుమార్ మిశ్రా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. ఇప్పుడు ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో విజయం సాధించిన కాక్రోచ్లు మనన్ కుమార్ మిశ్రా రాజీనామా కోసం మరో ఉద్యమం చేయాల్సి వస్తుందేమో.
ఏదిఏమైనా గతంలో పెద్దలు చెప్పినట్లు న్యాయవ్యవస్థలో ‘సబ్ ఠీక్ నహీ’. అయినా మన బంగారం మంచిదైతే.. అన్న సామెత మాదిరి చట్టాలు చేసే అధికారం గల సభల్లోకి సరైనవారు ఎన్నికై వస్తే ఈ పరిస్థితులు చక్కబడతాయేమో. ఇందుకోసం జెన్ జీ మరో మహా ఉద్యమం చెయ్యాలేమో.
దేవులపల్లి అమర్








