
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖాయం అవుతుందన్న ఆశలు కలుగుతున్న తరుణంలో మళ్లీ ఇరాన్‌పై దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధం కావడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ సీనియర్ నేతలతో కీలకాంశాలపై చర్చకు శుక్రవారం రాత్రి టెహ్రాన్ చేరుకోగా, అమెరికాతో సమన్వయంతో పనిచేస్తున్న ఖతార్ దౌత్యబృందం కూడా టెహ్రాన్‌కు విచ్చేసింది. ట్రంప్‌ను ఒప్పించి యుద్ధం ఆపడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రంగం లోకి దిగింది. సౌదీ అరేబియా, ఖతార్ ప్రతినిధులతో కలిసి దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ నుంచి మళ్లీ ప్రతిఘటన ప్రారంభమైతే, శత్రుత్వాలు ముదిరితే గల్ఫ్ దేశాల ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభం లోకి కూరుకుపోతుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైనిక చర్య వల్ల అమెరికా తన లక్షాన్ని సాధించలేదని అమెరికా మిత్రదేశాలు ఈ మూడూ హెచ్చరిస్తున్నాయి.
గతంలో ఇరాన్ దాడుల వల్ల తామెంత నష్టపోయామో తెలుసుకున్న యుఎఇ ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది. గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులకు పాల్పడినప్పుడు ఇరాక్ లోని మిలిటెంట్లను ఇరాన్ రెచ్చగొట్టి గల్ఫ్ దేశాలపై డ్రోన్లతో దాడులు చేయించింది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రేవు పట్టణాలకు, విద్యుత్ ప్లాంట్ల సౌకర్యాలకు కొన్ని లక్షల కోట్ల డాలర్ల వరకు నష్టం జరిగింది. అందుకనే ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి రానీయకూడదని ఈ దేశాలు ట్రంప్‌ను అభ్యర్థిస్తున్నాయి. ఇరాన్‌తో అమెరికా చర్చలు యథా ప్రకారం సాగుతున్నప్పటికీ ఒక కొలిక్కి రావడం లేదు. ఇరాన్ పూర్తిగా అణ్వాయుధాలను, నిల్వలను విసర్జించాలన్న అమెరికా షరతు వల్లనే చర్చలు అసంపూర్ణమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను, అణునిల్వలను విడిచిపెట్టేది లేదని తమ దేశ భద్రతకు అవి అవసరమని ఇరాన్ ప్రతిఘటిస్తోంది. దీంతో ట్రంప్ యుద్ధాన్ని ముగించేందుకు ఒకే ఒక్క నిర్ణయాత్మక భారీ సైనిక ఆపరేషన్ చేపట్టాలని భావిస్తున్నారు. మంగళవారం వరకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలనే ధోరణిలో ఉన్న ట్రంప్ గురువారం రాత్రి నుంచి దాడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తన కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆలోచన విడిచిపెట్టి వైట్‌హౌస్ లోనే ఉంటూ సైన్యాధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన వారితోనూ చర్చలు జరుపుతున్నారు. అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఇరాన్ చెబుతున్నప్పటికీ అమెరికా ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నాయని తెలిసి అప్రమత్తమవుతోంది. స్తంభింప చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, పోర్టులపై ఆంక్షలు ఎత్తివేయాలని, హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ ఉండి తీరాలని తదితర డిమాండ్లను తెరపైకి తెస్తోంది. అంతేకాదు తమ దేశ పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేసింది.
ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు తెలియజేసింది. మళ్లీ దాడులు జరిగితే ఆ యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని ఇరాన్ హెచ్చరించింది. ఈలోగా ఇరాన్ విదేశాంగ మంత్రి పాకిస్థాన్ విదేశాంగ మంత్రితో శుక్రవారం యుద్ధం ముగింపుకోసం చర్చలు జరిపారు. శుక్రవారం అమెరికా మిత్రదేశమైన ఒమన్ హర్మూజ్ జలసంధి ద్వారా తమ నౌకల రవాణాకు ఛార్జీల వసూలుపై ఇరాన్‌తో చర్చలు జరపడం గమనార్హం. ఈ సందర్భంగా హర్మూజ్ జలసంధి పర్యవేక్షణకు సంబంధించి హద్దుల విషయమై ఒమన్‌తో చర్చించినట్టు ఇరాన్ కొత్తగా ఏర్పాటు చేసిన పర్షియన్ గల్ఫ్ స్ట్రయిట్ అథారిటీ వెల్లడించింది. అయితే హర్మూజ్ జలసంధిపై నౌకల రవాణాకు ఇరాన్ ఛార్జీల వసూలు చేయడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. హర్మూజ్ జలసంధి మార్గంలో ఇరాన్ టోల్ వ్యవస్థను అమలు చేయడం చట్ట విరుద్ధమని, అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికీ లేదని, దీన్ని ఏ దేశమూ అంగీకరించ కూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పిలుపునిచ్చారు. ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు. హర్మూజ్ జలసంధి మీదుగా రవాణా సాగించే నౌకల నుంచి రూ. 18 కోట్ల వంతున ఇరాన్ ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టినట్టు ఇరాన్ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది.
హర్మూజ్‌పై నియంత్రణ సాధించడానికి, యుద్ధం వల్ల తమకు కలిగిన అపార నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ టోల్ వసూలు చేస్తున్నామని ఇరాన్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్టు, ఆ కుట్ర అమలు చేసే లోపే ఆ ఉగ్రవాది టర్కీలో అరెస్టు కావడం సంచలనం కలిగించింది. దీని వెనుక ఇరాన్ ఇరాక్ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు తిరిగి ప్రారంభమైతే లేదా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం మరింత తీవ్రమై, చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆహార ధాన్యాల ధరలు, ఎరువుల కొరత దేశీయ మార్కెట్‌లో సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. గల్ఫ్ దేశాలకు ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని, ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థను తీవ్ర మాంద్యం లోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది.











