
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆయన న్యాయమూర్తికి ఒక లేఖ రాస్తూ, కోర్టుపై తనకు విశ్వాసం పోయిందని తెలిపారు. తన అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశలు ఆవిరయ్యాయని, అందుకే మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో నడవాలని
నిర్ణయించుకున్నాని అందులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా గానీ, కనీసం నా తరఫు న్యాయవాది ద్వారా గానీ విచారణకు హాజరుకాబోనని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, చట్టపరంగా తనకు ఉన్న హక్కుల ప్రకారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. గతంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ, కేజ్రీవాల్ అరెస్ట్‌ను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఆమె బంధవులకు కేంద్ర ప్రభుత్వంలోని పలువురితో సత్సంబంధాలున్నాయని కేజ్రీవాల్ మొదటి నుంచి ఆరోపిస్తూ కేసు నుంచి ఆమె తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.













