
మనతెలంగాణ/హైదరాబాద్ : బండి భగీరథ్ అంశంలో కెటిఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదంటూ సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కెటిఆర్‌కు రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలి తప్ప ఒక మైనర్ బాలికను అ డ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించాలనుకోవడం శాడిజం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెటిఆర్ ఇంకా కల్వకుంట్ల రాజ్యాంగం లో ఉన్నామని భావిస్తున్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశా రు. కెసిఆర్ దిగిపోయి చాలా రోజులయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ జడ్జీలుగా మా రి తీర్పులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని, కానీ, వారు మైనర్ అమ్మాయిని అడ్డు పెట్టుకొని రాజకీ యం చేస్తున్నారని, బిఆర్‌ఎస్ నేతల మాదిరిగా రోడ్డుమీద పడి మాట్లాడితే బాధిత కుటుంబం ఆవేదన ఎలా ఉం టుందని ఆయన ప్రశ్నించారు.
ఆ పార్టీకి చెందిన వారికి బిఆర్‌ఎస్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు...?
కార్మికుల కనీస వేతనాల పెంపుపై సచివాలయంలో గు రువారం సిఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో కెటిఆర్ బావమరిది ఫాంహౌస్‌లో నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతే ఆ సమయమంలో తన బావమరిదిని అరెస్టు చేయాలని ఎందుకు చెప్పలేదని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కోడిపందాలు నిర్వహిస్తు దొరికిపోయినా, దుబాయ్‌లో మృతి చెందిన టాలీవుడ్ నిర్మాత కేదార్ విషయంలోనూ, బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో డ్ర గ్స్ పార్టీ చేసుకుంటూ పోలీసులపై కాల్పులు జరిపినా ఆ పార్టీకి చెందిన వ్యక్తులకు బిఆర్‌ఎస్ పార్టీ ఎందుకు షోకా జ్ నోటీసులు ఇవ్వలేదని, అప్పుడు కెటిఆర్ ఎక్కడున్నారని సిఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. చట్టాన్ని గౌరవిస్తామని చెబుతున్న కెటిఆర్ వారిని ఎందుకు పార్టీ నుం చి సస్పెండ్ చేయలేదని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతకంటే సిగ్గుతప్పి ఎవరైనా మాట్లాడుతారా అని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. డ్రగ్స్ కేసులో దొరికిన కెటిఆర్ బావమరిదికి పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఫోక్సో కేసులో బండి భగీరథ్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నోటీసులు ఇచ్చాక భగీరథ్ తరపున సమయం కోరారని, బాలిక మై నరా కాదా అనే విషయమై ప్రభుత్వం సమాచారం సేకరించిందన్నారు. అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకున్నా క వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుందని ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టు ఎందుకు తప్పపట్టలేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కెటిఆర్‌కు బండికి మధ్య ఏదో పంచాయితీ ఉంది
ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతోందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకు పంపిస్తున్నామని, అదే డ్రగ్స్, గంజాయి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెబుతూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉందని, ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను కెటిఆర్ ఆయన బావమరిది ఉపయోగించుకుంటున్నారని, ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. బండి భగీరథ్ కేసు చాల సున్నితమైన కేసు అని ఇందులో కేసు నమోదు చేసిన సెక్షన్‌లు, అరెస్టు, రిమాండ్, కోర్టులో తమ వాదనలో ఎక్కడైనా లోపముందా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కెటిఆర్‌కు బండి సంజయ్‌కు ఏదో పంచాయితీ ఉందని దానిని పిల్లల మీద పెట్టి పగ సాధించాలనుకుంటే ఎలా అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కెసిఆర్ ఎందుకు స్టేట్‌మెంట్ ఇవ్వలేదు?
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బండి భగీరథ్‌పై నమోదైన ఫోక్సో కేసులో ప్రభుత్వ చర్యలపై కెటిఆర్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యా రు. కెటిఆర్ ఆరోపణలు నిజం అయితే ప్రతిపక్ష నేత కెసిఆర్ ఎందుకు ఓ స్టేట్‌మెంట్ ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ ఎక్కడ నిద్రపోతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కెసిఆర్ బయటకు వచ్చి మాట్లాడేందుకు శక్తి లేకపోతే ఒక ప్రెస్ నోట్ అయినా ఇవ్వొచ్చు కదా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పక్క పార్టీ నుంచి నేత వస్తే జగిత్యాల వరకు వెళ్లి వచ్చిన కెసిఆర్ రాష్ట్రంలో ఇంత మేజర్ సంఘటన జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్పందించకుండా ఎటుపోయారని సిఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
రైతుల విషయంలో బిఆర్‌ఎస్‌వి శవ రాజకీయాలు
బిఆర్‌ఎస్ నేతలు మానవత్వం మరిచిపోయి వ్యవహారిస్తున్నారని, రైతుల విషయంలో శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాజకీయాల కోసం మరీ ఇంత దిగజారి వ్యవహారిస్తారా అని ఆయన ప్రశ్నించారు. నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
కేంద్రం ధరలను రోజూ పెంచుతోంది?
ప్రజా సమస్యలను, దేశాల మధ్య యుద్ధాన్ని బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలను రోజుకోసారి పెంచుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కులగణన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
కులగణన విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచామని సిఎం తెలిపారు.











