నేపాల్‌లో సంభవించిన విపత్తు, ఎగువ అసోంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వచ్చిన వరదలు.. అభివృద్ధి, పర్యావరణ పరిమితులు, విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత మధ్య ఉన్న ప్రమాదకరమైన అంతరాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఆగస్టు 26న హిమాలయ ప్రాంతంలో హిమానీనదం కూలిపోవడం, భారీ ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌ను కుదిపేసిన ఈ ఘోర విపత్తును కేవలం ఓ సుదూర పర్వత దేశం లో జరిగిన మరో విషాద ఘటనగా చూడకూడదు. ఇది మొత్తం హిమాలయ పర్వతశ్రేణికి, ముఖ్యంగా అసోం, బ్రహ్మపుత్ర లోయకు వచ్చిన హెచ్చరికగా పరిగణించాలి. నేపాల్, దానికి ఆనుకుని ఉన్న టిబెట్ ప్రాంతాల్లో రాళ్లు, మంచు, బురద, నీటితో కూడిన వరద ప్రవాహాలు జనావాసాలు, మౌలిక వసతులను ముంచెత్తడంతో కనీసం 800 మంది మరణించినట్లు, దాదాపు 1,000 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం. హిమపాతం కారణంగా ఏర్పడిన బురద ప్రవాహం, హిమానీనదాల్లో అస్థిరత ఈ విపత్తుకు కారణాలుగా భావిస్తున్నారు. దీనికి తోడు వాతావరణ మార్పులు హిమాలయ పర్యావరణాన్ని మరింత బలహీనంగా మార్చుతున్నాయి. ఈ హెచ్చరికను ఈ ఏడాది ఎగువ అసోంను ముంచెత్తిన అసాధారణ వరదలతో కలిపి చూసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా కనిపిస్తుంది. తరతరాలుగా అసోం వరదలను ఎదుర్కొంటూనే ఉంది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల సహజ ప్రవాహ చక్రంలో వరదలు ఒక భాగమే. అయితే 2026 జులై-, ఆగస్టులో ఎగువ అసోంను ముంచెత్తిన విపత్తు మాత్రం భిన్నమైనది. శివసాగర్, చరైడియో, జోర్హాట్, చుట్టుపక్కల ప్రాంతాలు.. దశాబ్దాలుగా ఇంతటి తీవ్రతతో వరదలను చూడని ప్రాంతాలు ఒక్కసారిగా నీట మునిగాయి.

వరదలు సహజమే. కానీ విపత్తు ఎప్పుడూ సహజమైనది కాదు. హిమానీనదాలు క్రమంగా కరిగిపోతున్న కొద్దీ హిమ సరస్సుల పరిమాణం పెరగవచ్చు. వాటిని అడ్డుకునే మొరైన్ కట్టలు అస్థిరంగా మారే అవకాశం ఉంటుంది. కొండచరియలు విరిగిపడటం, మంచుచరియలు విరుచుకుపడటంవల్ల భారీ పరిమాణంలో నీరు ఒక్కసారిగా కిందికి దూసుకురావచ్చు. జిఎల్‌ఒఎఫ్‌లు (గ్లేషియల్ లేక్ ఔట్‌బర్ట్ ఫ్లడ్స్) అంటే హిమసరస్సుల కట్టలు తెగిపోవడం వల్ల సంభవించే ఆకస్మిక వరదలు. ఇవి అత్యంత వేగంగా దిగువ ప్రాంతాలకు చేరుకుని జనావాసాలు, మౌలిక వసతులను ధ్వంసం చేయగలవు. దిగువ ప్రాంతాల్లో చేపట్టే ప్రణాళికల్లో ఇలాంటి ప్రమాదాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ఐసిఐఎంఒడి (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్) ప్రత్యేకంగా హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరిక మానవ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలదో నేపాల్ తాజాగా ప్రత్యక్షంగా చూపించింది.

ఇది అసోం ముందు నిలిచే అత్యంత అసౌకర్యకరమైన ప్రశ్నకు మనల్ని తీసుకెళ్తోంది: హిమాలయాలు, హిమాలయాల దిగువ ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ. అరుణాచల్‌ప్రదేశ్‌కు అపారమైన జలవిద్యుత్ సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యాన్ని వినియోగించాలన్న వాదన అర్థం చేసుకోదగినదే. భారత్‌కు విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, వ్యూహాత్మక మౌలిక వసతులు అవసరం. అయితే పునరుత్పాదక ఇంధనమంటే ప్రమాదాలు ఉండవని కాదు. 2025లో అసోం కార్యకర్తలు సుబన్‌సిరి ప్రాజెక్టును మరోసారి ‘పేలేందుకు సిద్ధంగా ఉన్న నీటి బాంబు’ గా అభివర్ణిస్తూ, ప్రాజెక్టు ముందుకు సాగించే ముందు భద్రతకు సంబంధించిన సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజల్లో నెలకొన్న తీవ్ర భయాందోళనలకు అద్దంపడుతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగుతున్నాయి. ఒకే నదీ పరీవాహక ప్రాంతంలో పది, ఇరవై, ముప్పై ప్రాజెక్టులు నిర్మిస్తే.. మొత్తం పరీవాహక ప్రాంతాన్నీ ఇంజినీరింగ్ చేసిన తర్వాత ఆ నదికి ఏమవుతుంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అసోం ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. దీనికి శాస్త్రీయ సమాధానం లభించాల్సిన అవసరం ఉంది. విద్యుత్‌ను ఎవరు పొందుతున్నారు? ఆ విద్యుత్ కోసం ముప్పును ఎవరు భరిస్తున్నారు?

హిమాలయ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక కోణం కూడా మరో అసౌకర్యకరమైన అంశాన్ని ముందుకుతెస్తోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు కాంట్రాక్టులు, నిర్మాణ కార్యకలాపాలు, కన్సల్టెన్సీ ఫీజులు, భూలావాదేవీలు, రాజకీయ ప్రాధాన్యం, వాణిజ్య అవకాశాలను సృష్టిస్తాయి. అయితే వీటి ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వాలు, కంపెనీలు, కాంట్రాక్టర్ల వంటి వర్గాల మధ్య కేంద్రీకృతమయ్యే అవకాశం ఉండగా.. పర్యావరణపరమైన నష్టాలు మాత్రం దిగువ ప్రాంతాల్లో నివసించే కోట్లాది ప్రజలపై పడతాయి. ఈ అసమతౌల్యాన్ని విస్మరించలేం. అయితే నిర్దిష్ట విపత్తు వల్ల ఏదైనా రాజకీయ నాయకుడు లేదా కంపెనీ వ్యక్తిగతంగా లాభపడిందని ప్రాజెక్టుకు సంబంధించిన ఆధారాలు లేకుండా ఆరోపించడం బాధ్యతారాహిత్యమే. కానీ హిమాలయ మౌలిక వసతుల అభివృద్ధి చుట్టూ ఉన్న రాజకీయ, వాణిజ్య ప్రోత్సాహకాలు.. దిగువ ప్రాంతాల ప్రజలను రక్షించాలన్న ప్రోత్సాహకాల కంటే బలంగా ఉన్నాయా? అని ప్రశ్నించడం మాత్రం పూర్తిగా సమంజసం. ఒక ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల ఆర్థిక విలువను సృష్టించి.. దిగువ ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తే.. ఆ బాధ్యత ఎవరిది? అన్నది కీలకమైన ప్రశ్న. ‘పర్యావరణ అనుమతి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది’ అనే సమాధానాన్ని అసోం ప్రజలు అంగీకరించాల్సిందేనని చెప్పలేం. ఎందుకంటే పర్యావరణ అనుమతి అనేది నిరంతర పర్యావరణ పర్యవేక్షణకు ప్రత్యామ్నాయం కాదు.

ఇదే సూత్రం భూటాన్‌కూ వర్తిస్తుంది. భూటాన్ భారత్‌కు స్నేహపూర్వక పొరుగు దేశం. మన దేశానికి ముఖ్యమైన భాగస్వామి కూడా. ఆ దేశ జలవిద్యుత్ రంగం భారత్‌తో సన్నిహితంగా అనుసంధానమై ఉంది. అయితే స్నేహబంధం జలప్రవాహాల వల్ల తలెత్తే ప్రమాదాలను తొలగించలేదు. భూటాన్ నుంచి దిగువకు ప్రవహించే నదులు నేరుగా దిగువ అసోంపై ప్రభావం చూపుతాయి. ఎగువ ప్రాంతాలనుంచి నీటిని విడుదల చేసిన తర్వాత నీటిమట్టాలు వేగంగా పెరిగితే.. దిగువ ప్రాంతాల్లో ఎంత త్వరగా ఆందోళన తలెత్తుతుందో ఇటీవలి పరిణామాలు చూపించాయి. 2026 ఆగస్టులో బొంగైగావ్, చిరాంగ్ జిల్లాల అధికారులు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు.

మరి ఏం మారాలి?

మొదటిది: హిమాలయాలను అంతులేని నిర్మాణ ప్రాంతంగా చూడటం ఆపాలి. కొత్త రహదారులు, సొరంగాలు, గనులు, ఆనకట్టలు, పట్టణాలు, విద్యుత్ ప్రసార మార్గాలకు అనుమతులు ఇచ్చే ముందు ఆ ప్రాంతం ఎంతవరకు నిర్మాణాలను తట్టుకోగలదో కచ్చితంగా అంచనా వేయాలి.

రెండోది: ఒక్కో ప్రాజెక్టుకు విడివిడిగా అనుమతులు ఇవ్వడం కాకుండా.. సమష్టి ప్రభావాన్ని అంచనా వేయాలి. ఒక్క ఆనకట్ట వల్ల కలిగే ప్రభావం పరిమితంగానే కనిపించవచ్చు. కానీ అదే నదీ పరీవాహక ప్రాంతంలో డజన్ల కొద్దీ ఆనకట్టలు, రహదారులు, సొరంగాలు, విద్యుత్ ప్రసార మార్గాలు, గనులు, నివాస ప్రాంతాలు ఏర్పడితే.. వాటి సమష్టి ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల నదీ పరీవాహక ప్రాంతం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని పర్యావరణ ప్రభావ అంచనాను తప్పనిసరి చేయాలి.

మూడోది: అసోంకు నిజమైన ఎగువ- దిగువ ప్రాంతాల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉండాలి. వర్షపాతం కొలిచే కేంద్రాలు, ఉపగ్రహ పరిశీలనలు, వాతావరణ రాడార్లు, నదీ ప్రవాహాన్ని కొలిచే గేజ్‌లు, ఆనకట్టల జలాశయాల సమాచారం, కొండచరియల కదలికలను గుర్తించే సెన్సర్లు, హిమ సరస్సుల ఆకస్మిక వరదల (జిఎల్‌ఒఎఫ్) పర్యవేక్షణ వ్యవస్థలు.. ఇవన్నీ ఒకే నిజసమయ వేదికకు అనుసంధానం కావాలి.

నాలుగోది: చిత్తడి నేలలు, బీల్స్ (సరస్సులను పోలిన సహజ నీటి మడుగులు), వరద మైదానాల్లోని అడవులు, పాత నదీ పాయలు.. ఇవి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న పనికిరాని భూములు కావు. అసోంకు సహజంగా లభించిన వరద నియంత్రణ మౌలిక వసతులు అవే. కరకట్టలతో నదులను ఎల్లప్పుడూ బంధించేందుకు ప్రయత్నించడం కాకుండా.. సాధ్యమైనచోట్ల సహజంగా వరద నీటిని నిల్వ చేసుకునే ప్రాంతాలను పునరుద్ధరించాలి.

ఐదోది: నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు, అడవుల నరికివేతను విపత్తు ముప్పు కోణంలో చూడాలి. నదీ గర్భాల్లో ఇసుక, రాళ్ల తవ్వకాలు, కొండలను విచ్చలవిడిగా తొలగించడం వంటి చర్యలను కేవలం పర్యావరణ ఉల్లంఘనలుగా మాత్రమే పరిగణించకూడదు. ఇవి నదుల స్వరూపాన్ని మార్చగలవు, నదుల్లో పేరుకుపోయే మట్టి, ఇసుక పరిమాణాన్ని పెంచగలవు. ఫలితంగా తీవ్ర వరద ప్రవాహాలను తట్టుకునే నదుల సామర్థ్యం తగ్గిపోతుంది.

ఆరోది: ఆనకట్టల భద్రతలో పారదర్శకత ఉండాలి. హిమాలయ ప్రాంతంలోని ప్రతి ప్రధాన ఆనకట్టకు సంబంధించి ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని వివరాలను వెల్లడించాలి.

ఏడోది: హిమాలయాలను ఉమ్మడి పర్యావరణ వారసత్వంగా కాపాడాలి. హిమాలయాలు కేవలం ఖనిజాలు, విద్యుత్, పర్యాటకం, వ్యూహాత్మక రహదారులకు మూలం మాత్రమే కాదు. అవి ఆసియాకు నీటి గోపురం. హిందూకుష్ -హిమాలయ ప్రాంతం నుంచి ఉద్భవించే జల వ్యవస్థలపై దాదాపు 200 కోట్ల మంది ఏదో ఒక రూపంలో ఆధారపడి ఉన్నారు. అందువల్ల అభివృద్ధి పేరుతో పర్వతాల పర్యావరణ స్థిరత్వాన్ని దెబ్బతీయడం దూరదృష్టి లేని చర్య అవుతుంది. హిమాలయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో పర్వతాలు అస్థిరంగా మారుతున్నాయి. తీవ్ర వర్షపాతం.. అడవుల నరికివేత, కొండచరియలు విరిగిపడటం, నదుల్లో మట్టి పేరుకుపోవడం, మౌలిక వసతుల నిర్మాణంతో కలిసి ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ప్రమాదకర ప్రాంతాల్లో జనావాసాలు, మౌలిక వసతులు విస్తరిస్తున్నాయి. అదే సమయంలో నదులను నియంత్రిస్తూ, వాటి సహజ ప్రవాహాన్ని విభజిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. అందువల్ల మన ముందున్న ఎంపిక అభివృద్ధి వర్సెస్ పర్యావరణం కాదు. తెలివైన అభివృద్ధి, బాధ్యతారహిత అభివృద్ధి మధ్యే ఉంది. రాజకీయ ప్రయోజనాలు, వాణిజ్య ఒత్తిళ్లు కాకుండా శాస్త్రీయ ఆధారాలే ఎక్కడ, ఎలా నిర్మాణాలు చేపట్టాలో నిర్ణయించాలి. నీరు ఇంటి గడపను తాకేలోపే విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత మొదలవ్వాలి. ఎందుకంటే హిమాలయాలు తదుపరి హెచ్చరిక పంపే సమయానికి.. ఆ పాఠాన్ని నేర్చుకునేందుకు మనకు మళ్లీ తగినంత సమయం ఉండకపోవచ్చు.


గీతార్థ పాఠక్

 (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)