ఎన్నికల ముంగిట దళపతిని వెన్నాడిన సమస్యలు

వ్యూహాత్మకంగా అధిగమించిన విజయ్

తక్కువ సమయంలోనే ఓటర్లను ఆకట్టుకున్న సినీ స్టార్

చెన్నై : తమిళ వెట్రి కజగం(టివికె) స్థాపించింది మొదలు దళపతి విజయ్ చుట్టూ సమస్యలు ముసురుకున్నాయి. రెండు జాతీయ పార్టీలతో పాటు తమిళనాడు వేళ్లూనుకుపోయిన ప్రాంతీయ శక్తులైన అధికార డిఎంకె, విపక్ష అన్నాడిఎంకెలతో సరికొత్త ప్రాంతీయ శక్తిగా రంగంలోకి దిగి బరిగీసి నిలిచాడు విజయ్. కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి పలువురు అభిమానులు దుర్మరణం చెందడంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. వారి కుటుంబాలను కలిసి వారికి ధైర్యాన్నిచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటానని భరోసా కల్పించాడు.

తోచినంత ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలిచాడు. అయితే కరూర్ ఘటనపై సిబిఐ విచారణ పేరిట విజయ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ పలుమార్లు విచారణకు పిలిచి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగింది. కీలక ఎన్నికల ప్రచార సమయం, అభ్యర్థుల ఎంపిక తదితర షెడ్యూళ్ల నడుమ ఆయన పలుమార్లు హస్తినకు వెళ్లి రావాల్సి వచ్చింది. దీనికి తోడు తన భార్య విడాకుల అంశం తెరపైకి వచ్చింది. అందుకోసం కోర్టుకు సమయం కేటాయించడం, స్వయంగా హాజరుకాలేనని విన్నవించడం జరిగింది. మొత్తానికి ఆ సమస్యను పరిష్కారానికి తెచ్చుకోవడం, దాన్ని తన ఇంటి సమస్య అని, ప్రజల సమస్యగా మార్చవద్దని ప్రజలను ఆయన వేడుకోవడమే కాకుండా ఒప్పించారు.

విపక్ష నేతలు పలువురు నటి త్రిషతో సంబంధాలు తెంచుకోవాలని మరో వివాదానికి తెరతీశారు. ఈ అంశంపై విజయ్ మౌనమే సమాధానంగా దానికి పుల్‌స్టాప్ పెట్టారు. ఇక మరో అత్యంత ముఖ్యమైన తన చిత్రం జననాయగన్ చిత్రం విడుదల కాకుండా అడ్డుకున్నా ఆయన ఏ మాత్రం స్పందించలేదు. వీటన్నింటిని సంయమనంతో,ఓర్పుతో వ్యూహాత్మకంగా వివాదస్పద అంశాలుగా మారకుండా ఎప్పటికప్పుడూ అధిగమిస్తూ వచ్చారు. తక్కు సమయంలో ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ముఖ్యంగా యువత విజయ్‌కు పట్టం కట్టారు. తన గెలుపును సులువు చేశారు.