
నివాసాల్లో ప్రీపెయిడ్ మీటర్లు బిగించి ప్రైవేటీకరణ దిశగా పన్నాగాలు
భవిష్యత్తులో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు
ఉచిత విద్యుత్ రద్దు కోసమే ఈ ఎత్తుగడలు
ప్రజలు ఇప్పటి నుంచే తిరగబడి కాంగ్రెస్ ఫ్యూజులు పీకెయ్యాలి
మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కెసిఆర్ అప్పుడు తలొగ్గలేదు
కార్యకర్తల సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ఆదాని వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పెందుకే సిఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టి పూర్తిగా రైతన్నలకు ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ ఎత్తగొట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. దీంతోపాటు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న మీటర్లు తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఈ మేరకు కేబినెట్ మీటింగ్‌లో మీటర్లన్నింటినీ తొలగించి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు.
మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో వ్యవసాయాలకు ప్రీపెయిడ్ మీటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ అంబర్‌పేట నియోజకవర్గం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి కెటిఆర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకువచ్చేందుకు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు రాకముందే, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తేక ముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసేయాలని కెటిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ విద్యుత్ రంగంలో చేస్తున్న కరెంటు కుట్రల పైన తిరగబడాలని కోరారు. కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని బిఆర్‌ఎస్ ఎన్నికల ముందే ప్రజలను హెచ్చరించిందని గుర్తు చేశారు. మోటర్ల దగ్గర మీటర్లు వస్తాయని, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పచెబుతారని కెసిఆర్ హెచ్చరించారని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రీపెయిడ్ మీటర్లను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తీసుకురావడం దారుణం అని పేర్కొన్నారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత ఒత్తిడి చేసినా, 30 వేల కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపినా కెసిఆర్ ఎదిరించి మీటర్లు పెట్టలేదని చెప్పారు. రానున్న మూడు నెలల్లోనే మొత్తం మీటర్లు పెడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. రానున్న మూడు నెలల్లోనే ఉన్న మీటర్లు పీకేసి, ప్రీపెయిడ్ మొబైల్స్ మాదిరి ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను తీసుకురాబోతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఎత్తగొట్టడం కోసమే ప్రీపెయిడ్ మీటర్లను తీసుకువస్తుందని ఆరోపించారు. కేవలం ఉచిత కరెంట్‌ను రద్దు చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే అదాని, అంబానీలకు విద్యుత్ సంస్థలను అప్పగించాలన్న లక్ష్యంతోనే క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కెటిఆర్ అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలంలో సగం పూర్తయినా ఇప్పటిదాకా ప్రజలకు గాని, రాష్ట్రానికి గాని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతిపైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం అని పేర్కొన్నారు.
సభ్యత్వ నమోదు అనంతరం శిక్షణ కార్యక్రమాలు
త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కెటిఆర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 1000 మంది పార్టీ కార్యకర్తలకు ఈ శిక్షణ ఇస్తామని తెలిపారు.అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరు పైన కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈసారి సభ్యత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని చెప్పారు. ముందుగా సభ్యత్వ నమోదు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ప్రజా సమస్యలపైన పోరాటం చేసే వారికే పార్టీ టికెట్లు
హైదరాబాద్ నగర పరిధిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపైన పోరాటం చేసే వారికే పార్టీ టికెట్లు ఇస్తామని కెటిఆర్ తేల్చిచెప్పారు. పార్టీ నాయకుల చుట్టూ, ఎంఎల్‌ఎ చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరిగే అభ్యర్థులకు సర్వేల ఆధారంగా పార్టీ కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లలో చేసిన అన్యాయాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రెండున్నర సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టని రేవంత్ రెడ్డి, అడ్డగోలుగా హైడ్రా పేరుతో వేల ఇండ్లు కూలగొట్టారని మండిపడ్డారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల నిర్మిస్తే, కాంగ్రెస్ మాత్రం వేల ఇండ్లు కూలగొట్టింది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు
ఉన్న నగరాన్ని పట్టించుకునే శక్తి లేదు కానీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్‌రెడ్డి అడ్డగోలు మాటలు చెప్తున్నారని కెటిఆర్ విమర్శించారు. ఉన్న నగరాన్ని పట్టించుకోవడం చేతగాని ముఖ్యమంత్రి, ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోజులు కొడుతున్నారని అన్నారు. ఉన్న నగరంలో కనీసం మోరి తీసి చెత్త ఎత్తే పరిస్థితిలో కూడా లేని మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ అంటే ఎవరూ నమ్మరని అడిగారు. ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతా అంటే పట్టించుకునేది ఎవరు..? అని ప్రశ్నించారు. ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వం హయాంలోనే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి, దాదాపుగా పూర్తయిన మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు.
ఇప్పటికే ముగిసిపోయిన మూసి ప్రక్షాళన పైన కేవలం కాంట్రాక్ట్ కమిషన్ల కోసమే సిఎం మాట్లాడుతున్నారని అన్నారు. ఎలాంటి విధ్వంసం లేకుండా, ఎలాంటి ఇండ్ల తొలగింపు లేకుండా మూసి ప్రక్షాళన చేయాలని గత సిఎం కెసిఆర్ ఆదేశిస్తే, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వేలాది మంది ఇండ్లు కూలగొట్టి, మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షలాది మంది ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు మండిపడ్డారు. గత ప్రభుత్వం మూసి పైన ఎస్‌టిపిల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులు ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు మళ్లీ లక్షన్నర కోట్లతో మూసి ప్రక్షాళన పేరుతో నాటకాలు ఎందుకు..? అని కెటిఆర్ ప్రశ్నించారు.












