
డంబుల్లా: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుకి వర్షం షాక్ ఇచ్చింది. అఫ్గానిస్థాన్-ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో వర్షం కారణంగా భారత్ ఓటమిపాలైంది. డిఎల్‌ఎస్ విధానంలో అఫ్గానిస్థాన్ జట్టు 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు 49 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66, వైభవ్ సూర్యవంశీ 44, సూర్యాంశ్ షెడ్జే 40 పరుగులు చేశారు.
అయితే వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అఫ్గాన్ విజయ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్ణయించారు. అయితే అఫ్గాన్ జట్టు దూకుడుగానే బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే తొలి వికెట్‌కి ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ 63 పరుగులు జత చేశారు. అయితే అర్షద్ ఖాన్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అర్షద్ బౌలింగ్‌లో ఐసాఖిల్(34) విప్రాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఆటగాడు ఖలీద్ తనివల్ అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో ఎల్బిడబ్ల్యూ అయ్యాడు.
దీంతో కష్టాల్లో పడ్డ జట్టుకు ఇమ్రాన్, బహిర్ షాల జోడీ అండగా నిలిచింది. మూడో వికెట్‌కి వీరిద్దరు 108 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థ శతకాలు సాధించారు. అయితే ఇమ్రాన్(75), షా(51) బ్యాటింగ్ చేస్తుండగా.. 25.5 ఓవర్ వద్ద మళ్లీ వర్షం ప్రారంభమైంది. అప్పటికే అఫ్గానిస్థాన్ స్కోర్ 2 వికెట్లకి 177 పరుగులుగా ఉంది. డిఎస్‌ఎస్ నిబంధన ప్రకారం అప్పటికే అఫ్గాన్ 4 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటంచారు అంపైర్లు.











