
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతాపార్టీ (సిజెపి) పై సత్వర దర్యాప్తు పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వ్యవస్థలపై వ్యంగ్మాత్మక విమర్శలతో ఏర్పాటు అయిన డిజిటల్ వేదిక పార్టీ సిజెపి ఇటీవల సోషల్ మీడియాలో దుమారం రేపుతూ, సునామీకి దారితీసింది. నకిలీ న్యాయవాదులున్నారనే ఆరోపణలపై, సిజెపి సంబంధిత కార్యకలాపాలపై కలిసికట్టుగా తక్షణ దర్యాప్తు జరగాల్సి ఉంది. దీనిపై తక్షణం విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్‌కె గోస్వామి బెంచ్‌కు తెలియచేశారు.
ఈ పార్టీ ఏర్పాటు ఇతర విషయాలపై మరీ అంతగా భావోద్వేగానికి గురి కావద్దని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్కా బాగ్చితో కూడిన ధర్మాసనం న్యాయవాదికి హితవు పలికింది. ఓ కేసు విషయంలో సిజెఐ చేసిన వ్యాఖ్యల ప్రాతిపదికనే బొద్దింకల పార్టీ ఏర్పాటు, అతి కొద్ది రోజుల్లోనే ప్రధాన జాతీయ పార్టీలకు దీనితో సంకట స్థితి ఏర్పడిన దశలో సిజెఐ బెంచ్ ముందుకే కేసు వచ్చింది. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఓ వైపు సిజెఐ వివరణ ఇచ్చారు. సందర్భాన్ని వేరే విధంగా అన్వయించుకోరాదని తెలిపారు. అయినప్పటికీ పార్టీ పేరిట ఓ వర్గం భారీ స్థాయిలో తప్పుడు, విద్వేషకర ప్రచారం సాగిస్తోందని పిటిషనర్ తరఫు లాయర్ తెలియచేశారు. ఇటువంటి వ్యవహారాలపై దర్యాప్తు అవసరం అని, తక్షణ విచారణతో తగు ఆదేశాలు వెలువరించాలని కోరారు. దీనికి సిజెఐ అడ్డుతగులుతూ మరీ సెంటిమెంటల్ కాకండని సూచించారు.
తలెత్తిన నకిలీ లాయర్లు, బూటకపు డిగ్రీల వ్యవహారం
సిజెపి ఏర్పాటు క్రమంలో ఇప్పుడు దేశంలో నకిలీ లా డిగ్రీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకూ నిజమనేది తేలాల్సి ఉందని మరో న్యాయవాది బెంచ్‌కు సూచించారు. కోర్టురూంల్లో జరిగే వాదోప వాదాలు, వ్యాఖ్యలను కొందరు చివరికి తమ లాభాలకు వాడుకుంటున్నారు. అంతర్గత వ్యాఖ్యలు కూడా వెలుగులోకి ఏ విధంగా వస్తున్నాయని నిలదీశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ లాయరు తనకు జడ్జి పోస్టు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 15న విచారణ జరిగింది.
ఈ దశలో సిజెఐ యువతలో ఓ వర్గం పనీపాటా లేకుండా కక్రోచ్‌లు, పరాన్నజీవులుగా మారారని స్పందించినట్లు వెల్లడైంది. దీనితో యువత నుంచి నిరసన క్రమంలోనే కక్రోచ్ పార్టీ దూసుకువచ్చింది. మరుసటిరోజే సిజెఐ వివరణ వెలువడింది. తన మాటలు వేరే విధంగా మీడియాలో ప్రచారం చేశారని , తనను వివాదంలోకి లాగడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు కేవలం తప్పుడు బూటకపు డిగ్రీలతో న్యాయవాద వృత్తిలోకి వస్తున్న లేదా వచ్చిన వారిని ఉద్ధేశించి చేసినవే అని ఈ వివరణలో తెలిపారు. అయితే ఇప్పుడు లాయర్లు, లా డిగ్రీలలో అన్ని నిఖార్సైనవి కావా? అనే మీమాంస తలెత్తింది. కోర్టు రూంల్లో అంతర్గత వ్యాఖ్యలు కూడా నియంత్రణలు లేకుండా వెలుగులోకి రావడం కూడా ఓ వివాదాస్పద అంశం అయింది.











