
చెన్నై : విజయ్ నేతృత్వంలోని టివికె ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డిఎంకె నాయకుడు, ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఐదుగురు ఎంఎల్‌ఎలు గెలవడానికి డిఎంకె కార్యకర్తలే కారణమని, గెలిచాక పదవుల కోసం తమతో కనీస మర్యాదగా మాట కూడా చెప్పకుండా టివికె మైనారిటీ ప్రభుత్వం చెంతకు చేరారని అన్నారు. కనీస కృతజ్ఞత లేకుండా వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదన్నారు. వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని ఉదయనిధి పేర్కొన్నారు.
భారతదేశవ్యాప్తంగా బిజెపి విజయానికి మోడీ, అమిత్ షాలే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో బిజెపి ఎదుగుదలకు కాంగ్రెసే కారణమని తనకు అర్ధమైందన్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మా నాయకుడు ఎంకే స్టాలిన్ తన భుజాలపై మోశారు అని ఉదయనిధి పేర్కొన్నారు. అయితే స్టాలిన్ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.
డిఎంకె కష్టకాలంలో ఉన్నప్పుడల్లా తమ పార్టీ వెన్నంటే ఉందని కాంగ్రెస్ ఎంపి మాణికం ఠాగూర్ అన్నారు. ఆదివారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. లౌకిక కూటమికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. డిఎంకె, అన్నాడిఎంకె మధ్య రాజకీయ పొత్తు కోసం బిజెపి మధ్యవర్తిత్వానికి ప్రయత్నించడం కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అన్నారు. బిజెపితో ఎలాంటి అవగాహనను కాంగ్రెస్ సహించదన్నారు.












