
నువ్వు నాలోకి ఒరిగినప్పడు
చిందిన అక్షరాలు తడిని అద్దుకున్నాయి
నువ్వు దాటేసిన ఆ క్షణం అదే సిరా ఒలికి
కొత్త భాష్యాలు నేర్పింది
పాళీ నిట్టనిలువునా చీలిన చప్పుడు
బద్దలైన హృదయానికి ప్రతీకగా నిలబడింది
సరిగ్గా ఆ సమయంలో అప్పుడెప్పుడో వీచిన
నీ ముంగురుల అలికిడి నాలో అలజడి రేపింది
మోహం అనుకున్నావేమో
అణువణువూ నిన్ను కలవరించిన దేహ విస్ఫోటనంలో వెతుకు
మనసంటూ వుంటే కను కొసన ఓ బిందువైనా రాలుతుంది
నీ శ్వాస నైనా అడుగు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల త్వరణ వ్యత్యాసాల లోగుట్టు
నీ చెవినైనా అడుగు నా పాదాల సవ్వడిలోని మ్యూజింగ్స్
గుండె చప్పుడులో తప్పిన లయలనైనా పసిగట్టు
ఊపిరి ఆగేలోపైనా మనిషిగా మసలుకో
వసంతం శిశిరం శిథిలావస్థకు పునరుజ్జీవం పోస్తుంది
- గిరి ప్రసాద్ చెలమల్లు













