
పేదవాడి చేతిలోకి వస్తున్న కొత్త స్మార్ట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కేవలం ప్లాస్టిక్ ముక్క కాదు.. అది ఆహార హక్కుకు, ఆత్మగౌరవానికి గుర్తు. ఆగస్టు 15 నుంచి కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్, వాటర్‌ప్రూఫ్ పివిసి, భద్రతా లక్షణాలతో కార్డును ఆధునికీకరించడం స్వాగతించాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా పేదవాడు ఎవరి ముందు చేయి చాచకుండా ఆకలి తీర్చుకునే హక్కుకు ఈ కార్డు ప్రతీక కావాలి. ముఖ్యమంత్రి మరో విషయాన్ని చెప్పారు. గతంలో దొడ్డు బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించేవారని, ఇప్పుడు 48 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నాణ్యమైన బియ్యం పేదల ఇంటి అవసరానికి చేరడం నిజంగా మార్పే అయితే స్వాగతించాలి. కానీ ఆ మార్పు ప్రతి అర్హత కుటుంబం గడప వరకు చేరుతోందా? అన్నదే అసలు పరీక్ష. కార్డుపై సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉండి ప్రధాని మోడీ ఫొటో లేకపోవడంపై బిజెపి ప్రశ్నిస్తోంది.
కేంద్రం ఐదుకిలోల ఉచిత ఆహార ధాన్యం అందిస్తోందని, రాష్ట్రం అదనంగా సన్నబియ్యం ఇస్తోందని చెబుతున్నప్పుడు ప్రజలకు కావాల్సింది బొమ్మల గొడవ కాదు.. కేంద్రం ఎంత? రాష్ట్రం ఎంత? అన్న స్పష్టమైన లెక్క. భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా కార్డుపై పునరాలోచిస్తే వివాదానికి తెరపడుతుంది. డీలర్ కమిషన్ విషయంలోనూ ప్రభుత్వం తాజా లెక్కలు బయటపెట్టాలి. 2023లో టన్నుకు రూ. 1,400 కమిషన్ నిర్ణయించినప్పుడు కేంద్రం రూ. 450, రాష్ట్రం రూ. 950 భరించే విధానం ఉంది. ఇప్పుడు 2026. ప్రస్తుతం డీలర్‌కు ఎంత? కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? బకాయిలెంత? అన్నది పౌరసరఫరాల శాఖ స్పష్టం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్‌తో పోల్చి తెలంగాణ పరిస్థితినీ ప్రజల ముందుంచాలి. అసలు కనువిప్పు కలిగించాల్సిన సమస్య రేషన్ దుకాణం దగ్గరే ఉంది.
వృద్ధుల వేలిముద్రలు పడక గంటల తరబడి మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సి వస్తోంది. వినియోగదారుడికీ, డీలర్‌కీ ఇబ్బందే. స్మార్ట్ కార్డు ఇచ్చి స్మార్ట్ సమస్యలు సృష్టించడం ఎందుకు? వేలిముద్ర విఫలమైతే ప్రతి రేషన్ దుకాణంలో ఐరిస్ స్కానింగ్ సౌకర్యం తప్పనిసరి చేయాలి. సాంకేతిక వైఫల్యం కారణంగా అర్హుడి రేషన్ ఆగకూడదు. ఇంకో మానవీయ ప్రశ్న ఉంది. ఇంటినుంచి బయటకు వెళ్లలేని వృద్ధ దంపతులు, మంచానికే పరిమితమైన వికలాంగులు, కుటుంబ సభ్యులు అందుబాటులో లేని ఒంటరి వృద్ధులు రేషన్ దుకాణానికి ఎలా వస్తారు? పింఛన్ గడపవద్దకు అందించే విధానం ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో రేషన్‌ను కూడా వారి గడప వద్దకే చేర్చే ప్రత్యేక వ్యవస్థ ఎందుకు ఉండకూడదు? అధీకృత ప్రతినిధి లేదా ప్రత్యేక మొబైల్ పంపిణీ ద్వారా సరఫరా చేయాలి. కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేకపోతే ప్రభుత్వం లేదా గ్రామస్థాయి యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి. సంక్షేమాన్ని ప్రకటించడం ప్రభుత్వ విజయం కాదు.. అది అర్హుడైన చివరి లబ్ధిదారుడి గడప దాటి చేరినప్పుడే ప్రభుత్వ పనితీరు కొలవాలి.
పౌరసరఫరాల శాఖ దగ్గర మరో లెక్క కూడా స్పష్టంగా ఉండాలి. రాష్ట్రంలో పాత కార్డులు ఎన్ని, కొత్తగా మంజూరైనవి ఎన్ని, తొలగించినవి ఎన్ని, పెండింగ్ దరఖాస్తులు ఎన్ని, కొత్త కార్డుల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఎన్ని అనే గణాంకాలను జిల్లాల వారీగా విడుదల చేయాలి. కార్డు ఇచ్చామని ప్రకటించడం ఒకటైతే, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి కార్డు చేరడం మరోటి. సన్నబియ్యం పంపిణీపైనా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలి. 48లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నప్పుడు నెలకు ఎంత ధాన్యం అవసరం? కొనుగోలు, మిల్లింగ్, రవాణా, నిల్వ, పంపిణీతో కలిపి ప్రభుత్వంపై పడే భారం ఎంత? కేంద్రం అందించే ఐదు కిలోల ధాన్యంతో రాష్ట్రం అందించే అదనపు కిలో ఎలా కలుస్తోంది? ఈ లెక్కలు బయటపెడితే పథకం విలువ మరింత స్పష్టమవుతుంది
రేషన్ వ్యవస్థలో మార్పు అంటే కార్డు రూపం మార్చడం మాత్రమే కాదు. అర్హత గుర్తింపు నుంచి ధాన్యం కొనుగోలు వరకు, గోదాము నుంచి డీలర్ దుకాణం వరకు, అక్కడి నుంచి లబ్ధిదారుడి గడప వరకు ప్రతి దశను పౌరసరఫరాల శాఖ పర్యవేక్షించాలి. నెలవారీగా, జిల్లాల వారీగా పంపిణీ, మిగులు, తిరస్కరణలు, బయోమెట్రిక్ విఫలతలు, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలకు డ్యాష్‌బోర్డు తరహాలో వివరాలు అందుబాటులో ఉంచాలి. అప్పుడు బొమ్మలపై జరిగే రాజకీయ వివాదాలకంటే సేవలపై ప్రజల తీర్పే ముఖ్యమవుతుంది. రేషన్ దుకాణంలో వృద్ధులకు ప్రత్యేక క్యూలు, వికలాంగులకు ప్రాధాన్యత, యంత్రం పనిచేయని రోజుల్లో ప్రత్యామ్నాయ ధ్రువీకరణ వంటి ఏర్పాట్లు కూడా తప్పనిసరి కావాలి. డీలర్‌ను కూడా సమస్యల మధ్య ఒంటరిగా వదిలేయకూడదు. వేలిముద్రలు పడకపోయినా, నెట్‌వర్క్ పనిచేయకపోయినా, యంత్రం మొరాయించినా వినియోగదారుడి ఆగ్రహాన్ని డీలరే ఎదుర్కొంటాడు.
అందుకే న్యాయమైన కమీషన్‌తోపాటు పరికరాల నిర్వహణ, ఇంటర్నెట్, విద్యుత్ వంటి సాంకేతిక సమస్యలకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. ప్రజల హక్కు పొందడానికి మధ్యవర్తి అవసరం లేని వ్యవస్థను నిర్మించాలి. ఫిర్యాదు చేస్తే సమయ పరిమితిలో పరిష్కారం చూపాలి. తప్పిదం జరిగితే బాధ్యులపై చర్య ఉండాలి. ఇదే నిజమైన పారదర్శకత, ఇదే బాధ్యతాయుతమైన సంక్షేమ పాలన. బొమ్మ ఎవరిదన్నది రాజకీయాలకు వదిలేద్దాం. కానీ పేదవాడి చేతిలోని కార్డు ఆకలి ముందు పని చేస్తుందా? అన్నదే ప్రభుత్వానికి అసలు పరీక్ష. కేంద్రం తన వాటా చెప్పాలి. రాష్ట్రం తన వాటా చెప్పాలి. డీలర్ కమీషన్ చెప్పాలి. సన్నబియ్యం వ్యయం చెప్పాలి. కార్డు తయారీ ఖర్చు చెప్పాలి. అప్పుడు ప్రజలే ఎవరి పాత్ర ఎంతన్నది నిర్ణయిస్తారు. బొమ్మల పంచాయితీ ముగియాలి. బియ్యం లెక్క తేలాలి. డీలర్‌కు న్యాయం జరగాలి. వేలిముద్ర విఫలమైతే ఐరిస్ రావాలి. గడప దాటలేని వృద్ధుడి గడపకే రేషన్ చేరాలి. అప్పుడే స్మార్ట్ కార్డు నిజమైన ఆత్మగౌరవ పత్రం అవుతుంది. లేకపోతే కార్డు కొత్తదే.. పేదవాడి కష్టం మాత్రం పాతదే!.
శ్రీశైలం దూడం
91339 47176








