
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ఇం డస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పి) విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చే సింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం హిల్ట్ పి విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణి జ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిల్ట్ పి పాలసీ కింద అర్హత గల పరిశ్రమల యూనిట్ల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. 2025 నవంబర్ 22 తేదీన జారీ చేసిన జిఒ 27 ద్వారా హిల్ట్ పి ప్రకటించారు. ఈ పాలజీ కోర్ అర్బన్ రీజియర్(క్యూర్) పరిధిలోని 21 ఇండస్ట్రియల్ పార్కులు, స్వతంత్ర పరిశ్రమలలో ఉన్న కా లుష్యకారక పరిశ్రమలను పునరావాసం చేయడానికి రూపొందించారు. అమలు విధానంలో భాగ ంగా కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ (డిఐఎఫ్)ను ముందస్తుగా చెల్లించే విధానం, 2026 జూన్ 30 లోపు దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు ప్రస్తు త ఎస్‌ఆర్‌ఒ మార్కెట్ రేట్లను పరిగణనలోకి తీసుకోవడం ఆమోదించారు. కొత్తగా ప్రారంభించిన డిజిటల్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన పరిశ్రమల యూనిట్ హోల్డర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ మేరకు హిల్ట్ పి అమలుపై పరిశ్రమల యజమానుల అభిప్రాయాలను సేకరించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిజిఐఐసి) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక, చర్లపల్లి, కుషాయిగూడ, నాచారం, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలకు చెందిన ఐఎఎల్‌ఎ ప్రతినిధులు హాజరయ్యారు. దరఖాస్తులను టీజీఐఐసీ అధికారిక వెబ్‌సైట్ tgiic.telangnana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తుదారులు, శాఖ అధికారులకు దరఖాస్తు ప్రక్రియ సమయంలో సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. భాగస్వాములు తమ సందేహాలు లేదా సమస్యలను నిర్మిత టికెటింగ్ వ్యవస్థ ద్వారా నమోదు చేయవచ్చు. ఏదైనా సహాయం కోసం ఆన్‌లైన్ పోర్టల్ http://hiltp-tgiic.floww.ai/raiseaticket, హెల్ప్‌లైన్ 7729 -983215 ఫోన్ నెంబర్‌లో సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చు. ఒఆర్‌ఆర్ పరిధిలో ఉన్న 9,292 ఎకరాల పరిశ్రమల భూమి మార్పిడి లక్షంగా ఈ పాలసీని రూపొందించినట్లు తెలిసింది.
హిల్ట్ పి మార్గదర్శకాలు విడుదల
ఔటర్ రింగ్ రోడ్డు (ఒఆర్‌ఆర్) లోపల, సమీపంలో ఉన్న పారిశ్రామిక భూములను మల్టీయూజ్ జోన్స్(బహుళ వినియోగ ప్రాంతాలు)మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ(హిల్ట్ పి) అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిజిఐఐసి) నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం ప్రధానంగా 21 పారిశ్రామికవాడల్లోని యూనిట్లకు వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUs) కేటాయించిన భూములకు ఈ విధానం వర్తించదు. టిజిఐఐసి (గతంలో ఎపిఐఐసి) ద్వారా భూమి పొంది, సేల్ డీడ్ పూర్తయిన పారిశ్రామిక ప్లాట్లు/యూనిట్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యుటేషన్, ఆస్తి పన్ను, సబ్-డివిజన్ చార్జీల వంటి అన్ని బకాయిలు చెల్లించిన వారికి మాత్రమే స్క్రీనింగ్ కమిటీ అనుమతి లభిస్తుంది.
ఫీజుల వివరాలు...
భూమి విస్తీర్ణాన్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది
ఒక ఎకరా వరకు: రూ. 20 వేలు
1 నుంచి 5 ఎకరాలు: రూ. 50 వేలు
5 నుంచి 10 ఎకరాలు: రూ. లక్ష
10 నుంచి 25 ఎకరాలు రూ.2 లక్షలు
25 నుంచి 50 ఎకరాలు రూ.5 లక్షలు
50 ఎకరాలు పైబడిన వాటికి: రూ. 10 లక్షలు
దరఖాస్తు సమయంలోనే డవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డిఐఎఫ్)లో 10 శాతం ముందస్తుగా చెల్లించాలి. 2026 జూన్ 30 వరకు దరఖాస్తు చేసేవారికి పాత ఎస్.ఆర్.ఓ ధరలే వర్తిస్తాయి. మిగిలిన 90 శాతం మొత్తాన్ని రెండు వాయిదాల్లో (ఒక్కొక్కటి 45 శాతం చొప్పున) 90 రోజుల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. గడువు దాటితే నెలకు 1 శాతం చొప్పున జరిమానా విధిస్తారు.
తరలిపోయే పరిశ్రమలకు చేయూత
నగర పరిధి నుంచి బయటకు వెళ్లే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది.
నగర శివారు నుంచి వెలుపలకు మారే యూనిట్లకు ప్రస్తుతమున్న సబ్సిడీలు, ప్రయోజనాలు కొత్త చోట కూడా వర్తిస్తాయి.
విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన రుసుములను సర్దుబాటు చేస్తారు.
ఓఆర్‌ఆర్ వెలుపల ఉండే పారిశ్రామికవాడల్లో వీరికి ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తారు.
మార్పిడి అనుమతి పొందిన తర్వాత కూడా ఏడాది వరకు ప్రస్తుత చోట కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
దరఖాస్తు విధానం
దరఖాస్తుదారులు టీజీఐఐసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు సేల్ డీడ్, ఈసీ, ఆస్తి పన్ను రశీదు, ఫోటోలు వంటి పత్రాలను సమర్పించాలి. దరఖాస్తులను పరిశీలించడానికి రెండు బృందాలతో కూడిన స్క్రూట్నీ కమిటీని ఏర్పాటు చేశారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగిలిన మొత్తాన్ని మూడు రోజుల్లోనే వాపస్ చేస్తారు. ఈ నిర్ణయంతో నాచారం, మల్లాపూర్, చెర్లపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, పటాన్‌చెరు, మౌలాలీ,ఉప్పల్, మౌలాలి, బాలానగర్, వంటి కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక భూములు నివాస, వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి రానున్నాయి.












