అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు వేతనాలు పెంచే దిశగా అమెరికా ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ మేరకు అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వెల్లడైంది.
కొత్త ప్రతిపాదనల ప్రకారం హెచ్-1బీ వర్కర్ల కనీస వేతనాలు ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే సుమారు 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రతిభను తక్కువ వేతనాలతో నియమించుకోవడం వల్ల అమెరికా స్థానిక ఉద్యోగులపై ప్రభావం పడుతోందన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
పలు కేటగిరీల్లో పనిచేస్తున్న హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల్లో సవరణలు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా వేతన భద్రత కల్పించడం, అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ నెల 26 వరకు గడువు నిర్ణయించారు. ప్రవేశ స్థాయి ఉద్యోగుల కోసం ప్రస్తుతం ఉన్న 97 వేల డాలర్లకు పైబడిన కనీస వేతనం, 33 శాతం పెరుగుదలతో ఇకపై 1,23,212 డాలర్ల వరకు చేరనుంది. అలాగే లెవల్-2, లెవల్-3 తదితర కేటగిరీల ఉద్యోగాలకు కూడా వేతన సవరణల సిఫార్సులు విడుదల చేశారు.













