మన తెలంగాణ/హైదరాబాద్: వేగంగా పెరుగుతున్న ప ట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జ రిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా పట్ట ణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యే క దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రోడ్లు, ర వాణా వ్యవస్థ, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరించాల్సిన అ వసరం ఉందన్నారు. ముఖ్యంగా నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సిఎం సూచించారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటు న్న చర్యలను ముఖ్యమంత్రి సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదని, బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ఇప్పటికే సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.

నగరంలో పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్

నగరంలో పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించామని, ఓఆర్‌ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (ప్యూర్) ప్రాంతాన్ని ప్రధానంగా మాన్యుఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించామని ఆయన తెలిపారు. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్‌ణు ఇప్పటికే ఆవిష్కరించుకున్నామన్నారు.

కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి ఈవీ బస్సులు

లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం అని ముఖ్యమంత్రి చెప్పారు.

స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ అందజేత

నగరంలో త్రాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ఈ సందర్భంగా కమిటీ ముఖ్యమంత్రిని అభినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. అంతకుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు ఇతర సభ్యులను ముఖ్యమంత్రి సత్కరించారు. తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు.