
కొన్ని విషయాలకు ప్రత్యేక వివరణలు అక్కర లేదు. అవి ఎంత సీరియస్‌వి అయినప్పటికీ. సమస్య మొదలైన కొత్తలో కొంత సంక్లిష్టత ఉన్నా ఎక్కువ సమయం అక్కర లేకుండానే అందరికీ అర్థమైపోతాయి. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం సంగతి అట్లానే మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల దాడులు ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా, నిష్కారణంగా మొదలై నేటికి (ఏప్రిల్ 25) సరిగ్గా 57 రోజులు. ఇందులో సుమారు సగకాలం గడిచేసరికి యుద్ధం ప్రతిష్టంభనలో పడింది. రెండవ సంగతి మొదలైనప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇక ముందుకెట్లా సాగాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇపుడు తాజా పరిస్థితినే గమనించండి. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ కలిసి వేర్వురు విధాలుగా హర్మూజ్ జలసంధిని మూసివేశాయి. జలసంధి ముఖద్వార ప్రాంతం నుంచి అమెరికన్ నౌకలను ఖాళీ చేయించగల శక్తి ఇరాన్‌కు లేదు. ముఖ ద్వారం నుంచి మొదలుకొని ఉత్తరాన పర్షియన్ సముద్రం వరకు గల జలాలను ఇరాన్ నియంత్రణ నుంచి విముక్తం చేయగల బలం అమెరికాకు లేదు.
మరొక స్థాయిలో చూసినపుడు, ఇరాన్ షరతులను అమెరికా గాని, అమెరికా షరతులను ఇరాన్ గాని ససేమిరా అంగీకరించటం లేదు. దానితో అంతా ప్రతిష్టంభన. సమస్య ఏమంటే, విషయమంతా ఇరాన్ కన్న అమెరికాకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అమెరికా మొత్తం ప్రపంచంలోనే అన్ని విధాలా అతిశక్తివంతమైన అగ్రరాజ్యం. సహేతుకమైన కారణం ఏదీ చూపకుండానే ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం ప్రారంభించింది. అటువంటి యుద్ధాలు విజయవంతం కావాలంటే ఎటువంటి ఎదురు సవాళ్లు లేకుండా ఇరాన్‌ను కన్నుమూసి తెరిచేలోగా ఓడించి లొంగదీసుకోవాలి. కాని గత జనవరిలో వెనిజులాలో జరిగిన విధంగా ఇక్కడ కూడా సాధించగలమని లెక్కలు వేసి, రెండు నెలలు పూర్తి కావస్తున్నా అటువంటి జాడలైనా లేవంటేనే అదొక పెద్ద ప్రతిష్టంభన అన్నమాట. కొందరు పాశ్చాత్య వ్యాఖ్యాతలైతే ఇది అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ఓటమి అంటూ తీర్పులు చెప్పటం మొదలైపోయింది గాని, మనం మాత్రం ప్రతిష్టంభన అంటూ ఆగుదాము.
ప్రతిష్టంభన ఎట్లా కనిపిస్తున్నదో పైన రెండు మాటలు చెప్పుకున్నాము. ఇపుడు మరి రెండు మాటలు చూద్దాము. అధ్యక్షుడు ట్రంప్‌ను గమనించండి. రకరకాల హెచ్చరికలు, రకరకాల చేతలు. ఒకదానికొకటి సంబంధం ఉండదు. పరస్పర విరుద్ధంగా కూడా ఉంటాయి. ఆ ధోరణి అమెరికా సహా, యూరప్ సహా, అమెరికా మిత్రదేశాలు సహా ప్రపంచమంతటా నవ్వులపాలవుతుంటుంది. ట్రంప్‌ను అపహాస్యం చేస్తూ అమెరికా, యూరప్‌ల నుంచి రోజుకు వందలాది వ్యంగ్యమైన పోస్టులు వెలువడుతున్నాయి. మనకు చేరటం లేదు గాని, అమెరికాలో, వేర్వేరు యూరోపియన్ చట్టసభలలో ఆయనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై చాలా తీవ్రమైన విమర్శలు వినవస్తున్నాయి. అవి ఒక్కోసారి ఎంత ఘాటుగా ఉంటున్నాయంటే, అదే మన పార్లమెంటులో జరిగితే బిజెపి సభ్యులు ప్రతిపక్షాల వైపు దూసుకు వెళ్లి దాడులు చేయగలరు.
ట్రంప్‌కు ఒకవైపు ఇరాన్ కొరకరాని కొయ్యగా మారటం, మరొక వైపు పాశ్చాత్య ప్రపంచం నుంచి ఈ తరహా విమర్శలు చాలవన్నట్లు, ఇంకొక వైపు స్వయంగా తన ప్రభుత్వలోని ముఖ్యులు సైతం తనతో విభేదించటం, రాజీనామాలు చేయటం మొదలైంది. ఇటువంటి ముప్పేట పరిణామాల ఒత్తిడి వల్లనే ఆయనకు ఎటూ తోచని పరిస్థితి ఎదురవుతున్నది. ఇది నిజానికి తను తీసుకున్న గోతిలో తాను పడటమే. గత కొద్ది రోజులుగా జరుగుతున్నదేమిటో గమనించండి. పాకిస్థాన్‌లో చర్చల కోసం ఇరుపక్షాలు అంగీకరించినప్పుడు, సమస్య నెమ్మదిగా ఒక కొలిక్కి రావచ్చుననే ఆశాభావం కలిగింది. దానితో ఇరాన్ హర్మూజ్ దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అటువంటప్పుడు అమెరికా కూడా అదే స్ఫూర్తితో వ్యవహరించి ఉంటే చర్చలు మరి కొన్ని విడతలుగా జరిగి శాంతి ఏర్పడి ఉండేది. నిజానికి ఇరాన్ ఆ చర్చలకు ముందు రోజులలో ప్రతిపాదించిన షరతులు చర్చలకు యోగ్యమైనవని, ఒకటి రెండు మినహా తక్కిన వాటిపై తమకు అభ్యంతరాలు లేవని ట్రంప్ అన్నారు కూడా.
ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమం, ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం విషయంలోనూ కొన్ని రాజీ సూత్రాలు వినిపించాయి. దాని ప్రకారం, అణుశుద్ధిని ఇరాన్ వదులుకోకుండానే కొంత కాలం పాటు వాయిదా వేస్తుంది. ఇప్పటికే శుద్ధి అయిన యురేనియంను భద్రత కోసం రష్యాకు అప్పగిస్తుంది. కాని విషయం ముందుకు సాగక విఫలమైంది. అందుకు ఏకైక కారణం, హర్మూజ్ దిగ్బంధాన్ని ఇరాన్ ఎత్తివేయగా, తాము మాత్రం ఇరాన్ రేవులను దిగ్బంధించగలమన్న ట్రంప్ ప్రకటన. అంతేకాదు. వారి నౌకలను నిర్బంధించటం, ప్రపంచ వ్యాప్తంగా కూడా నిర్బంధించగలమని హెచ్చరించటంతో అంతా బెడిసిపోయింది. ఇరాన్ తమకు భయపడిపోయి చర్చలకు వస్తున్నదని, విధిలేక హర్మూజ్ దిగ్బంధాన్ని ఎత్తివేసిందని, కనుక ఇరాన్ రేవుల దిగ్బంధం ద్వారా ఒత్తిడి ఇంకా పెంచితే ఇక లొంగిపోక తప్పదన్నది ట్రంప్ వేసిన లెక్క. కాని అది ఎంత పొరపాటు లెక్కో వెంటనే తెలిసిపోయింది. అంతకు ముందు నెలన్నరపాటు ఇరాన్‌తో యుద్ధం తర్వాత కూడా ఆయనకు వాస్తవాలు బోధపడలేదు.
ఆ వెంటనే జరిగిందేమిటి? అమెరికా చర్యల దృష్టా తాము కూడా హర్మూజ్‌ను తిరిగి దిగ్బంధిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. బయటి నౌకలపై దాడులు చేసి పట్టుకోవటం మొదలుపెట్టింది. పదిరోజుల యుద్ధవిరమణ కాలాన్ని ఇక పొడిగించేది లేదని, ఆ వెంటనే తిరిగి యుద్ధం ప్రారంభించగలమన్న ట్రంప్, చివరి దశలో విరమణను పొడిగించినా, ఈసారి పొడిగింపు నిరవధికమని అన్నా ఇరాన్ నాయకత్వం లెక్క చేయలేదు. తన మాటలకు ఎప్పుడూ కట్టుబడక, పూటకొకటి చెప్పే ట్రంప్‌ను తాము నమ్మలేమని మధ్యవర్తి పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. ముందుగా ఇరాన్ రేవుల దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేస్తేనే చర్చలకు రాగలమన్నది. దానితోపాటు, అణుశుద్ధికి తమకు గల హక్కును అంగీకరించి తీరాలని, తమపై నిష్కారణంగా సాగించిన యుద్ధానికి నష్టపరిహారం చెల్లించాలని, హర్మూజ్‌పై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని తేల్చిచెప్పింది. పరిస్థితి ఇపుడక్కడ ప్రతిష్టంభించి ఉన్నది. అమెరికా అధ్యక్షునికి దిక్కుతోచక, సమస్య పరిష్కారానికి తనకు తొందరేమీ లేదని, వేచిచూడగలనని అంటున్నారు.
రాగల రోజులలో ఏమి జరుగుతుందన్నది అట్లుంచితే, అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం ఎటూ పాలుపోని స్థితిలో చిక్కుకుని ఉన్నారన్నది దీనంతటితో కనిపిస్తున్న వాస్తవస్థితి. తమవైపు నుంచి చూడగా అది ఒక అగ్రస్థాయి సామ్రాజ్యవాద దేశం. తాను ఒక పరమ అహంకారపూరిత అధ్యక్షుడు. ఇజ్రాయెల్ ప్రయోజనాల భారాన్ని తలకెత్తుకున్నాడు. ఇద్దరూ కలిసి కూడా ఇరాన్‌ను ఓడించలేకపోవటమంటే, పశ్చిమ ప్రాంతమంతటా తిరుగులేని ఆధిపత్యం నెలకొనాలన్న లక్షం నెరవేరకపోవటం, తమ ఏజెంట్ అయిన ఇజ్రాయెల్‌కు సమానంగా ఆ ప్రాంతంలో మరొక శక్తి అవతరించటం, పాలస్తీనా ఎప్పటికైనా పూర్తిస్థాయి స్వతంత్రరాజ్యంగా ఏర్పడగల అవకాశాలు సజీవంగా ఉండటం, తమ కూటమికి చెందిన గల్ఫ్ రాజ్యాలకు తమ పట్ల గురి తగ్గటమేగాక మొత్తం ప్రపంచంలోనే ప్రతిష్ఠ దెబ్బతినటం, రష్యా, చైనాల ప్రతిష్ఠ పెరగటం అవుతుంది. ఇరాన్ వైపు నుంచి ఆలోచించినట్లయితే, నిరుటి 12 రోజుల యుద్ధం, ఇప్పటి నెలన్నర యుద్ధంతో, హర్మూజ్ జలసంధిని అమెరికా విముక్తం చేయలేకపోవటంతో, పదాతి సేనలను రంగంలోకి దింపేందుకు అమెరికా జంకుతుండటంతో, తాము గత కొద్ది రోజులలో కొన్ని విదేశీ నౌకలను దిగ్బంధించినా ఏమీ చేయలేకపోతుండటంతో తమ శక్తి ఏమిటో తమకు బాగా అర్థమైంది. ఈ కాలంలో అమెరికా బలహీనతలు, ఇరాన్ శక్తియుక్తులు ఇంకా పలు రూపాలలో ప్రపంచం దృష్టికి వచ్చాయి.
దానితో అమెరికా అధ్యక్షుడి పరిస్థితి కాలుకాలిన పిల్లివలే మారింది. ముందకు పోలేరు, వెనుకకు రాలేరు. ఆయన ఇరకాటం బాగా అర్థమైనందువల్లనే ఇరాన్ నాయకత్వం, తమ షరతులకు అంగీకరిస్తే తప్ప చర్చలకు రాబోమని మధ్యవర్తికి తేల్చిచెప్పింది. ఈ స్థితిని గ్రహించినందువల్లనే ట్రంప్ ఈసారి కాల్పుల విరమణను నిరవధికమన్నారు. రాజీలు కుదిరే వరకు పొడిగిస్తున్నామన్నారు. అట్లా అంటూనే అంతలో మరేదో చేయటం ట్రంప్‌కు అలవాటైన విషయమే గనుక తిరిగి ఏమైనా చేయవచ్చుగాని, ప్రస్తుతానికి కనిపిస్తున్నది మాత్రం ఆయన కుడితిలో పడ్డ ఎలుకవలే కొట్టుకుంటుండటం. పరిష్కారాన్ని చిత్తశుద్ధితో ఆశిస్తుంటే అందుకు సులభమైన మార్గముంది. చేయవలసింది, అంతర్జాతీయ అణు ఇంధనశక్తి సంస్థ చట్టాల ప్రకారం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక సంస్థ ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకందారు అయిన ఇరాన్‌కు, శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం శుద్ధిహక్కు ఉందని అంగీకరించటం. పాలస్తీనా సృష్టిని గుర్తించటం. ఈ రెండు జరిగితే తక్కిన సమస్యలన్నీ సులభంగా తేలిపోతాయి.
- టంకశాల అశోక్ (దూరదృష్టి)
- రచయిత సీనియర్ సంపాదకులు



