న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు విపక్ష పార్టీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారంనాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అస్థిరపరచేందుకు వీరు కుట్రపన్నుతున్నారని, హింసను రెచ్చగొడుతున్నారని అన్నారు. పాలకపక్షాన్ని ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎదుర్కోవడంలో విఫలం కావడంతో ఉద్దేశపూర్వకంగా దేశంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఆరోపించారు.దేశాన్ని అస్థిరపరచేందుకు కాంగ్రెస్, విపక్ష పార్టీల టూల్‌కిట్ గ్యాంగ్ కలలు కంటోందని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ ప్రకటన ఆషామాషీగా చేసినది కాదని, దేశంలో అరాచకం వ్యాప్తి చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమన్నారు. రాజకీయ నిరాశానిస్పృహలే ఇందుకు కారణమని గోయల్ దుయ్యబట్టారు. డైనమిక్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రజల గుండెల్లోంచి వేరుచేయలేమని, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పోరులో ఓడించలేమని రాహుల్ గాంధీ అండ్ కంపెనీకి బాగా తెలుసన్నారు. దీంతో ఇప్పుడు దేశంలో హింసను రెచ్చగొట్టాలని కోరుకుంటున్నారన్నారని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని కోరుతూ విదేశాలకు వెళ్తున్నారని, కాంగ్రెస్ నిజమైన ఉద్దేశం ఏమిటో రాహుల్ మాటలే చెబుతున్నాయని గోయల్ ఆరోపించారు.