భారత రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక చర్చ.. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ (జమిలి ఎన్నికలు జరుగుతాయా?). అయితే, ఈ లక్ష్యం చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) రూపంలో పెను సవాలు ఎదురవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు తరహాలోనే, జమిలి ఎన్నికల బిల్లు కూడా పార్లమెంటులో అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజార్టీ సాధించలేక ‘కమిలిపోయిన ముఖంతోనే’ సభలోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం, ప్రతి జనాభా గణన తర్వాత దేశంలోని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను జనాభా ప్రాతిపదికన సవరించాలి. అయితే, జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం, 2001లో వాజపేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు నిలిపివేశాయి. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తుండటం, కొత్త పార్లమెంట్ భవనం (అధిక సీట్ల సామర్థ్యంతో) సిద్ధం కావడంతో ఈ చర్చ వేడెక్కింది.

2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనపై దేశం రెండుగా విడిపోయింది. కానీ కేంద్రంలో ప్రతిపక్షాలను ఒక్కటి చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం సాధిస్తాయి, అదే సమయంలో జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ గొంతుకను కోల్పోతాయనే ఆందోళన నెలకొంది. ఈ ‘ప్రాతినిధ్యపు కోత’ భయమే ఇప్పుడు జమిలి ఎన్నికల బిల్లుకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. దీనిని ప్రతిపక్షం ప్రధాన పావుగా వాడింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయంగా గురు-శిష్యులుగా పేరున్న చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి ఈ అంశంపై భిన్నమైన, లోతైన విశ్లేషణలు చేస్తున్నారు: దక్షిణాది రాష్ట్రాలు ‘వృద్ధుల ప్రాంతాలు’గా మారకూడదని, జనాభా పెంచాలని పిలుపునిస్తూనే, కేంద్రం ప్రతిపాదిస్తున్న సీట్లపెంపునకు మద్దతుగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు.మరోవైపు కేవలం జనాభానే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు రాష్ట్రాలు ఇచ్చే వాటా, అభివృద్ధి ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ‘హైబ్రిడ్ మోడల్స్‌ను రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు.

పెంచబోయే సీట్లలో 50% జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యత వంటి అంశాల ఆధారంగా కేటాయించాలని ఆయనహైబ్రిడ్ మోడల్‌ను సూచిస్తున్నారు. చంద్రబాబు-, రేవంత్‌ల ఆలోచనలు వేరుగా ఉన్నా, దక్షిణాదికి అన్యాయం జరగకూడదనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఏ రాష్ట్రానికీ ప్రస్తుతమున్న సీట్ల సంఖ్యను తగ్గించబోమని, అందరికీ సీట్లు పెరుగుతాయని కేంద్రం హామీ ఇచ్చింది (ఉదాహరణకు: 543 సీట్లను 800+ కి పెంచడం). అయితే, సీట్లు పెరిగినా... పార్లమెంట్లో దక్షిణాది ఎంపిల శాతం తగ్గి, ఉత్తరాది ఎంపిల శాతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాటా తగ్గింపు లేకుండా ప్రస్తుతమున్న 543 సీట్లను సుమారు 848 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలని ప్రతిపాదన ఉంది. అయితే ఈ ప్రతిపాదనకు పురిట్లోనే సంధి కొట్టినట్లయింది. ఇప్పటికీ దీనికి విన్-విన్ పరిష్కారం ఒకటి ఉంది. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెంచినప్పటికీ, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న ‘సీట్ల నిష్పత్తి’ (Seat Share Percentage) తగ్గకుండా చూడటం.

అంటే, సభలో దక్షిణాది బలం తగ్గకుండా అదనపు వెయిటేజీ ఇవ్వడం. ఆర్థిక ప్రాతిపదికన వెయిటేజీ (Finance -Linked Representation) కల్పించడం వంటి ప్రతిపాదనలు చేయవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్లుగా, కేవలం జనాభానే కాకుండా రాష్ట్రం చెల్లించే పన్నులు (GST/Direct Taxes), తలసరి ఆదాయాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకోవడం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ సహకారం అందించే రాష్ట్రాలకు పార్లమెంట్లో నిర్ణయాత్మక శక్తి ఉండేలా కొన్ని సీట్లను కేటాయించడం. అంతేగాక లోక్‌సభలో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, దానిని రాజ్యసభ (Council of States) ద్వారా సరిదిద్దవచ్చు. ఇక్కడ అమెరికా మోడల్‌ను గమనించాల్సిఉంది. అమెరికాలో రాష్ట్రం చిన్నదైనా, పెద్దదైనా సెనెట్లో ప్రతి రాష్ట్రానికి ఇద్దరు సభ్యులే ఉంటారు. అదే విధంగా, భారత రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పెంచి, కీలక బిల్లుల విషయంలో రాజ్యసభకు మరింత పట్టునివ్వడం ద్వారా చిన్న రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడవచ్చు. 1971 నుండి ఇప్పటివరకు జనాభా నియంత్రణలో ఏ రాష్ట్రాలైతే ఉత్తమ పనితీరు కనబరిచాయో, ఆ రాష్ట్రాలకు ‘అభివృద్ధి బోనస్’ కింద అదనపు సీట్లు లేదా ప్రత్యేక నిధులు కేటాయించడం.

దీనివల్ల బాధ్యతాయుతంగా ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఫలితంగా ఉత్తరాదికి.. జనాభాకు తగ్గట్టుగా సీట్లు పెరుగుతాయి. అభివృద్ధికి అవసరమైన నిధులు అందుతాయి. సంఖ్యాబలం పెరుగుతుంది. అలాగే దక్షిణాదికి.. సీట్ల శాతం తగ్గకుండా ‘వెయిటేజీ’ లభిస్తుంది. పన్నుల వాటాలో కోత పడకుండా రక్షణ ఉంటుంది. పాలసీ నిర్ణయాల్లో ‘వీటో’ లేదా సమాన గౌరవం లభిస్తుంది. నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా (సుమారు 543 నుండి 850కి) మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తే, ప్రస్తుతం ఉన్న పురుష ప్రతినిధుల సంఖ్య తగ్గి రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచి, అందులో మహిళలకు వాటా ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా, ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.2011 లేదా రాబోయే జనాభా గణన ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అడ్డుకున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి 2/3 వంతు మెజార్టీ అవసరం. ఏప్రిల్ 17, 2026న లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అవసరమైన 352 ఓట్లు రాకపోవడంతో (సుమారు 298 ఓట్లు మాత్రమే వచ్చాయి) ఈ కీలక బిల్లు ఆమోదం పొందలేదు.

ఇంతవరకూ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు పరిమితమైన ఈ వైరుధ్య ప్రభావం రానున్నకాలంలో జమిలి ఎన్నికలపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2029లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో ఉంది. దీనిపై కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంటోంది. దీనికోసం ఆర్టికల్ 83, 172 వంటి వాటికి సవరణలు చేయాలి. దీనికి కూడా పార్లమెంట్లో 2/3 మెజార్టీతోపాటు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. 2024 లేదా 2025లో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల కాలపరిమితిని 2029 వరకు కుదించడం లేదా పొడిగించడం ద్వారా అన్ని రాష్ట్రాలను ఒకే గాడిలోకి తీసుకువస్తారు. మొదటి దశలో లోక్‌సభ, అసెంబ్లీలకు.. రెండో దశలో (100 రోజుల వ్యవధిలో) స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ప్లాన్ ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 (పార్లమెంట్ పదవీకాలం), ఆర్టికల్ 172 (అసెంబ్లీల పదవీకాలం) వంటి కీలక అంశాలను సవరించాలంటే 2/3 మెజార్టీ (సుమారు 362 ఓట్లు) తప్పనిసరి. ఏప్రిల్ 2026లో మహిళా రిజర్వేషన్/ డీలిమిటేషన్ బిల్లు సమయంలో ప్రభుత్వానికి సుమారు 292- 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అంటే, ప్రభుత్వానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 60- 70 ఓట్ల దూరం ఉంది. రాజ్యసభలో కూడా విపక్ష కూటమి (I.N.D.I.A) బలంగా ఉంది. అక్కడ కూడా 2/3 మెజార్టీ సాధించడం NDAకి ప్రస్తుతానికి కష్టమే. జమిలి ఎన్నికల బిల్లు కేవలం పార్లమెంట్‌లో ఆమోదం పొందితే సరిపోదు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తి ప్రకారం కనీసం 50% రాష్ట్రాల అసెంబ్లీలు (అంటే 15 రాష్ట్రాలు) ఈ బిల్లును ఆమోదించాలి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలు (తమిళనాడు, కేరళ, తెలంగాణ), పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల హక్కుల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావడమే ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మారుతోంది. కేంద్రం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించవచ్చు, కానీ అది అంత సులభం కాదు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ సమస్యలు పక్కకు పోయి, కేవలం జాతీయ అంశాలకే ప్రాధాన్యత లభిస్తుందని, ఇది ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదమని విపక్షాలు భావిస్తున్నాయి. మధ్యలో ప్రభుత్వం పడిపోతే (No Confidence Motion) పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

దీనిపై ఏకాభిప్రాయం కుదరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే 2028 డిసెంబర్ 8వ తేదీతో రేవంత్ సర్కార్ పదవీకాలం ముగిసిపోతుంది. ఒకవేళ కుదిరితే 2029 జూన్ 23 వరకు పొడిగింపు పొందే అవకాశాలున్నాయి. కాగా ఏప్రిల్ 2026లో మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడంవల్ల అది 2/3 మెజారిటీ సాధించలేక వీగిపోయింది. ప్రభుత్వానికి కావాల్సిన ‘మ్యాజిక్ ఫిగర్’కు 60 -70 ఓట్లు తక్కువగా ఉండటం కేంద్రం బలహీనతను చాటిచెప్పింది. ఇప్పుడు అదే బాటలో జమిలి ఎన్నికల బిల్లు కూడా ప్రవేశపెడితే, ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) దీనిని అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా లేదా రాష్ట్రాల కాలపరిమితిని మార్చడం ద్వారా ముందుకు వెళ్లాలని చూస్తే, అది న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుంది. సుప్రీంకోర్టులో ‘సమాఖ్య స్ఫూర్తి’ ప్రాతిపదికన ఈ నిర్ణయం సవాలుకు గురయ్యే అవకాశం ఉంది.

ఈ పరిస్థి తుల్లో 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే కేంద్ర పట్టుదలకు ప్రతిపక్షాల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదనిపిస్తోంది. డీలిమిటేషన్, జమిలి ఎన్నికలు అనేవి కేవలం సాంకేతిక అంశాలు కావు, ఇవి దేశ ‘సమాఖ్య స్ఫూర్తి’కి సంబంధించిన పరీక్షలు. కేంద్రం ‘మధ్యేమార్గం’ వెతకకుండా మొండిగా ముందుకు వెళ్తే, అది దేశంలో ఉత్తర- దక్షిణ ధ్రువాల మధ్య అగాధాన్ని మరింత పెంచుతుంది. ప్రజాస్వామ్యంలో బలప్రయోగం కంటే ఏకాభిప్రాయమే శ్రీరామరక్ష! డీలిమిటేషన్ బిల్లు విఫలమైన తర్వాత, జమిలి ఎన్నికల బిల్లు ముందుకు రావడం అంటే అది ఒక పెద్ద రాజకీయ పరీక్ష. ఉత్తరాది- దక్షిణాది విభేదాలు, రాష్ట్రాల నిరాకరణ, 2/3 మెజార్టీ కొరత, న్యాయపరమైన అడ్డంకులు... ఇన్ని సవాళ్ల మధ్య ఈ బిల్లు గట్టెక్కాలంటే అది నిజంగా ఒక ‘రాజకీయ అద్భుతం’గానే భావించాలి. లేకపోతే, డీలిమిటేషన్ బిల్లులాగే.. జమిలి ఎన్నికల బిల్లు కూడా చరిత్రలో మరో విఫల ప్రయోగంగా మిగిలిపోవచ్చు -

- దిమిలి అచ్యుతరావు

93951 50036