
న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చరిత్రలోనే తొలిసారిగా పెట్రోల్ యేతర వాహనాలు రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేశాయి. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు (సిఎన్‌జి, హైబ్రిడ్, ఈవి) పాసింజర్ వాహనాల(పివి) సేల్స్‌లో పెట్రోల్ కార్లను దాటేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫడా) విడుదల చేసిన వివరాల ప్రకారం, గత ఆగస్టు నెలలో దేశంలో మొత్తం 24,23,201 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది ఆగస్టు 2025లోని 20,62,038 యూనిట్లతో పోలిస్తే 17.51 శాతం వృద్ధిని సాధించింది.
పాసింజర్ వాహనాల మార్కెట్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా 41.95 శాతానికి చేరగా, పెట్రోల్ వాహనాల వాటా 40.85 శాతానికి తగ్గింది. ఆగస్టులో పాసింజర్ వాహనాల విక్రయాలు 16.14 శాతం పెరిగి 4,02,398 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 19.69 శాతం వృద్ధితో 17,14,610 యూనిట్లు, మూడు చక్రాల వాహనాలు 8.64 శాతం వృద్ధితో 1,22,281 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 14.45 శాతం పెరిగి 90,769 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫడా అధ్యక్షుడు సాయి గిరిధర్ మాట్లాడుతూ, చరిత్రలోనే మొదటిసారిగా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు పెట్రోల్ విక్రయాలను అధిగమించాయని తెలిపారు. వర్షపాతం కొరత వల్ల ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నాన్-ఫార్మ్ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడంతో మిగిలిన విభాగాలు మంచి వృద్ధి సాధించాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ నుండి నవంబర్ పండుగల సీజన్ లో 81.62 శాతం డీలర్లు మెరుగైన అమ్మకాలను ఆశిస్తున్నారు.













