నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చెలరేగిన మంటలు బహుళ అంతస్తుల భవనానికి వ్యాపించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 100 మంది నివాసితులను ఖాళీ చేయించి మంటలను అదుపు చేశారు. పొగతో ఊపిరాడక ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ సహా మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

నోయిడాలోని సెక్టార్ 66లోని మముర గ్రామంలో ఓ భవనంలో ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నోయిడా సెంట్రల్ డిసిపి వెల్లడించారు. ఈ మంటలు తర్వాత పెట్రోల్ వాహనాలకు అంటుకొని.. పై అంతస్తులకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.