
న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో శనివారం నిర్వహించిన వన్ వరల్డ్ : వన్ హ్యూమానిటీ ఫెయిత్ లీడర్స్ సమ్మిట్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘ముస్లింలను భారతదేశం నుంచి వెళ్లగొట్టాలని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేడు’ అని చేసిన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీస్తోంది. భారత్‌లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతాన్ని ఆయన ప్రస్తావించడం విస్మయం గొలుపుతోంది. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ చరిత్రలో ప్రముఖ నాయకుల్లో ఒకరైన ఎంఎస్ గోల్వాల్కర్ ఆనాడు భారతదేశానికి అత్యంత శత్రువులుగా ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులని తన ప్రసంగాల సంకలనం ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలో స్పష్టం చేయడాన్ని ఇప్పుడు చర్చల్లో ప్రస్తావనకు ఉదహరించడమవుతోంది. ప్రస్తుతం మోహన్ భగవత్ అమెరికా లో వెల్లడించిన అభిప్రాయాలకు ఆనాడు గోల్వాల్కర్ వెల్లడించిన అభిప్రాయాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ పాత భావజాలాన్ని భగవత్ విస్మరిస్తున్నారా? ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక స్వరం మారుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ను చాలా లోతుగా పరిశీలించిన వారికి వైవిధ్యాన్ని ఆ సంస్థ ప్రోత్సహించడం కానీ, సమర్ధించడం కానీ చేయదని, ఎప్పటినుంచో ‘సాంస్కృతిక జాతీయవాదం”అనే సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని చాలా మందికి తెలుసు. ఆ సిద్ధాంతం ప్రకారం భారతీయ సంస్కృతికి మూలం హిందూ సంస్కృతియే అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. చాలామంది భారతీయుల ఆలోచనా విధానాల్లో స్థిరపడిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ భావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భగవత్ దృష్టిలో భిన్నత్వం అనేది ప్రత్యేకతలను విడదీసే భావన కాదు. అది పరస్పర పూరకమైనది. ‘మనలో సహజంగా ఉన్న ఏకత్వానికి భిన్నత్వం ఒక అలంకారం: దాన్ని కాపాడాలి’ అని భగవత్ తన అభిప్రాయాలను వెల్లడించారు. క్రైస్తవ, యూదు, హిందూ, ఇస్లాం మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఫెయిత్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘మనుషుల మధ్య ఉన్న వైవిధ్యం, మన సహజమైన ఏకత్వాన్ని దెబ్బతీయదు.
వైవిధ్యం ప్రకృతి లోని సహజ నియమం కాగా, దాని వెనుక ఉన్న అంతర్లీన సత్యం ఏకత్వం. అందువల్ల మన స్వంత ప్రత్యేకతను ఎలా గౌరవించి కాపాడుకుంటామో, అలాగే ఇతరుల ప్రత్యేకతను కూడా గౌరవించి రక్షించాలి’ అని భగవత్ తన తాత్విక ఆలోచనలను చక్కగా వివరించారు. 2018లో కూడా భగవత్ ఇదే విధంగా సమగ్రత, సర్వమత సామరస్యం ప్రస్తావించారు. ‘ప్రపంచంలో అన్ని మార్గాలు చివరికి ఒకే లక్షాన్ని చేరుకుంటాయి’ అని ప్రాచీన రుషుల బోధనను గుర్తు చేశారు. చరిత్రలో ఇతర దేశాల్లో రక్షణ లభించని వివిధ మతాలకు చెందిన ప్రజలకు భారతదేశం అశ్రయం ఇచ్చిందని ఉదహరించారు. చాలా కాలం క్రితం స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభలో చేసిన ప్రసంగ ంలోని మత సామరస్యం, అన్ని మతాలను గౌరవించే భారతీయ సంప్రదాయం తదితర భావాలను గుర్తుకు తెస్తున్నాయి. భారతదేశ వ్యవస్థాపక నేతలు భారత దేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు కలిసిన సమాహారంగా స్పష్టంగా విశ్వసించారు. వాటన్నిటినీ గౌరవించి, రక్షించినప్పుడే దేశం ఐక్యంగా, విజయవంతంగా ఉంటుందని విశ్వసించారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగం లోని కొన్ని ప్రాథమిక సూత్రాలను, ముఖ్యంగా సమాఖ్యవ్యవస్థను ఎప్పుడూ సమర్థించలేదు. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు, ప్రభుత్వాలు కూడా ప్రజలందరినీ కలుపుకుని పనిచేసేందుకు, తమకు ఉన్న సమస్యలను, ప్రయోజనాలను గుర్తించేందుకు సహాయం చేయడానికి బదులు, మతపరమైన భేదాలను ముందుకు తెస్తున్నాయి.
దీనికి తాజా ఉదాహరణ ‘వందేమాతరం’ గేయంపై ముసురుకున్న వివాదం. దేశభక్తికి సంబంధించిన ఒక గీతం లేదా చిహ్నం విషయంలో కూడా ప్రజల మధ్య మతపరమైన విభేదాలు, పెరిగే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరం. దేశం కోసం అందరూ కలసి పనిచేసే అంశాలను ముందుకు తేవడం కంటే ‘ఎవరు ఏ మతానికి చెందినవారు?’ అనే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాదాపు 80 సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ మనుగడ సాగిస్తోంది. గతంలో భారత దేశాన్ని, హిందూ సమాజాన్ని, ఇతర మతాల ప్రజల స్థానాన్ని వేర్వేరుగా చూసేది. అలాంటిది ఇప్పుడు భారతదేశం అన్నిమతాలకు చెందిన ప్రజలదే అనే సామరస్య భావాన్ని స్పష్టంగా అంగీకరిస్తే అది స్వాగతించదగిన పరిణామమే అవుతుంది. ఇటీవల కొన్నాళ్లుగా భగవత్ చేసిన వ్యాఖ్యల్లో మత సామరస్యం తొంగిచూస్తోంది.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అనే తేడాల కంటే భారతీయుల మూలాలన్నీ ఒకటేనని, దేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ వారు ఏ మతాన్ని అనుసరించినా, సుమారు 40,000 సంవత్సరాల క్రితం వరకు ఒకే మూలమైన డిఎన్‌ఎ ఉందని పలుమార్లు భగవత్ ప్రస్తావించడం గమనార్హం. ప్రతి ముస్లిం ప్రార్థనా స్థలంలోనూ ఒక శివలింగం ఉందేమో అన్న అనుమానంతో వెతకవద్దని సూచించారు. సంప్రదాయవాదులకు ఈ వ్యాఖ్యలు మింగుడుపడకపోయినా సామరస్య భావజాలం కలిగిన వారికి ఈ మార్పులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత కదంతొక్కినప్పుడు వారి నిరసనలను దేశ వ్యతిరేక చర్యలుగా చూడకుండా, వారి ఆలోచనలు, అసంతృప్తి, దేశం పట్ల వారి నిబద్ధతను అర్థం చేసుకోవాలని, వారితో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి భగవత్ హితోపదేశం చేశారు.











