
అబుదాబి: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైదొలగడం మధ్యప్రాచ్య ఇంధన రంగంలో కీలక మార్పులకు దారితీసింది. మే 1 నుంచి ఒపెక్ విధించిన ఉత్పత్తి పరిమితులు యూఏఈపై అమల్లో ఉండవు. దీంతో దేశం తన పూర్తి సామర్థ్యంతో ముడి చమురు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం పొందింది. ఈ పరిణామం భారత్‌కు మరింత చమురు సరఫరా జరిగే అవకాశాలను తెరిచింది. ప్రత్యేకంగా హబ్షాన్‌ఫుజైరా పైప్‌లైన్ ద్వారా హార్మూజ్ జలసంధిని పూర్తిగా దాటేసి చమురు రవాణా చేయడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధిలో అంతరాయాల నేపథ్యంలో భారత్ ఇప్పటికే ఫుజైరా మార్గాన్ని వినియోగిస్తోంది.
ఇప్పుడు ఒపెక్ కోటా పరిమితులు లేకపోవడంతో యూఏఈ రోజుకు అదనంగా దాదాపు 10 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచగలదు. దీంతో భారత్‌కు మరింత, అలాగే తక్కువ ధరలో చమురు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, పెట్రోకెమికల్ అవసరాల కోసం భారత్ భారీగా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం దేశ ఇంధన భద్రతకు ఊరటనివ్వనుంది. మంగళవారం అబుదాబి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. దాదాపు 60 ఏళ్ల ఒపెక్ సభ్యత్వానికి యూఏఈ ముగింపు పలికింది. ఉత్పత్తి విధానం, జాతీయ ప్రయోజనాలపై సమగ్ర సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎమ్ వెల్లడించింది.
యూఏఈ ఇంధన మంత్రి సుహైల్ మొహమ్మద్ అల్ మజ్రూయీ మాట్లాడుతూ, దీర్ఘకాలిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీసుకున్న విధానపరమైన పరిణామం ఇది అని చెప్పారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) చీఫ్ సుల్తాన్ అల్ జాబెర్ కూడా దీనిని సార్వభౌమ నిర్ణయంగా అభివర్ణించారు. దేశ అసలు ఉత్పత్తి సామర్థ్యానికి, ప్రపంచ ఇంధన స్థిరత్వానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఒపెక్ నిబంధనల కారణంగా యూఏఈ చమురు ఉత్పత్తి రోజుకు సుమారు 34 లక్షల బ్యారెళ్లకు పరిమితమై ఉండేది. అయితే దేశంలోని చమురు క్షేత్రాలు, మౌలిక వసతులు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ కూటమి ప్రపంచ మార్కెట్‌లో చమురు అధికంగా ప్రవహించి ధరలు కుప్పకూలకుండా ఉండేందుకు సభ్య దేశాల ఉత్పత్తిపై పరిమితులు విధిస్తూ వస్తోంది. ధరల స్థిరత్వం, ఆదాయ రక్షణ కోసం సభ్య దేశాలు తక్కువ ఉత్పత్తికి అంగీకరిస్తాయి. అయితే ప్రస్తుతం రోజుకు సుమారు 48 నుంచి 50 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూఏఈకి ఈ కోటా పరిమితులు అడ్డంకిగా మారాయని భావించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
హార్మూజ్‌ను దాటేసే ఫుజైరా పైప్‌లైన్
ఈ కొత్త అవకాశంలో ప్రధాన ఆకర్షణ హబ్షాన్‌ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్ లేదా అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ఏడీసీఓపీ). అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా పోర్ట్ వరకు సుమారు 380406 కిలోమీటర్ల మేర ఈ పైప్‌లైన్ విస్తరించి ఉంది. హార్మూజ్ జలసంధిపై ఆధారపడకుండా ఉండేందుకే దీనిని నిర్మించారు. 2012లో సుమారు 4 బిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి చేసిన ఈ 48 అంగుళాల పైప్‌లైన్ రోజుకు 15 లక్షల బ్యారెళ్ల చమురు తరలించే సామర్థ్యం కలిగి ఉంది. కొన్ని అంచనాల ప్రకారం దీని సామర్థ్యం 18 లక్షల బ్యారెళ్ల వరకు పెరగవచ్చని చెబుతున్నారు. పైప్‌లైన్‌లో చిన్న భాగం మాత్రమే సముద్రంలో ఉండగా, మిగతా భాగం యూఏఈ భూభాగం గుండా వెళ్తుంది. ఫుజైరా పోర్ట్ నుంచి ముర్బన్ క్రూడ్‌తో నిండిన ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి ప్రయాణిస్తాయి. దీంతో ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో సుమారు 20 శాతం జరిగే హార్మూజ్ జలసంధిని పూర్తిగా దాటేయవచ్చు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది వ్యూహాత్మకంగా మరింత కీలకంగా మారింది.
భారత్‌కు మరింత భద్రమైన సరఫరా
భారత్‌కు ఈ మార్గం ఇప్పటికే ఉపయోగకరంగా మారింది. హార్మూజ్ ప్రాంతంలో అంతరాయాలు ఎదురైన సమయంలో భారత రిఫైనరీలు ఫుజైరా మార్గం ద్వారా దిగుమతులను పెంచాయి. ఈ పైప్‌లైన్ ఫుజైరా రిఫైనరీతో పాటు ఎగుమతి టెర్మినల్స్‌కు కూడా చమురు సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఒపెక్ పరిమితులు తొలగిపోవడంతో కోటా ఆందోళనలు లేకుండా మరింత చమురు ఈ మార్గంలో భారత్‌కు చేరే అవకాశం ఉంది. త్వరిత సరఫరా, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే భారత కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. హార్మూజ్ జలసంధి గుండా సుదీర్ఘ సముద్ర మార్గాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇక ఫుజైరా కూడా ప్రపంచ ప్రాముఖ్యమైన చమురు కేంద్రంగా ఎదిగింది. భారీ నిల్వ ట్యాంకులు, బంకరింగ్ సదుపాయాలు, లోతైన సముద్ర పోర్ట్‌తో ఇది కీలక హబ్‌గా మారింది. గల్ఫ్ వెలుపల ఉండటం వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం తక్కువగా ఉండటంతో యూఏఈతో పాటు ఆసియా దేశాలకూ సరఫరా భద్రతపై మరింత నమ్మకం పెరుగుతోంది.
భారత్‌కు మరింత స్థిరమైన చమురు సరఫరా
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ సంబంధాలు కేవలం చమురుకే పరిమితం కాకుండా వాణిజ్యం, భద్రత, పెట్టుబడులు వంటి అనేక రంగాలకు విస్తరించాయి. ప్రస్తుతం ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 200 బిలియన్ డాలర్ల లక్ష్య దిశగా సాగుతోంది. ఇందులో ఇంధన రంగమే ప్రధాన పాత్ర పోషిస్తోంది.
భారత్‌కు దిగుమతి అయ్యే ముడి చమురులో యూఏఈ వాటా సుమారు 9 నుంచి 10 శాతం వరకు ఉంది. అలాగే ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాలో కూడా యూఏఈ కీలక భాగస్వామి. ఇటీవల ఇరు దేశాల మధ్య 3 బిలియన్ డాలర్ల ఎల్‌ఎన్‌జీ ఒప్పందం కుదిరింది. అదేవిధంగా భారత కంపెనీలు యూఏఈ చమురు క్షేత్రాల్లో పెట్టుబడులు కూడా పెట్టాయి.
ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముర్బన్ వంటి యూఏఈ చమురు గ్రేడ్‌లను వినియోగిస్తున్న భారత రిఫైనరీలకు ఇకపై మరింత స్థిరమైన సరఫరా, అలాగే అనుకూల ధరలు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భద్రతా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో విశ్వసనీయ భాగస్వాముల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ క్రమంలో యూఏఈ భారత్‌కు కీలక మిత్రదేశంగా నిలుస్తోంది. ఫుజైరా మార్గం ద్వారా చమురు సరఫరా జరగడం వల్ల హోర్ముజ్ జలసంధిపై భారత్ ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ దిగుమతి వైవిధ్యీకరణ వ్యూహానికి కూడా బలాన్నిస్తుంది. అయితే అదనపు చమురు సరఫరా ఎంతవరకు పెరుగుతుందన్నది గల్ఫ్ ప్రాంత సముద్ర రవాణా సాధారణ స్థితికి ఎప్పుడు చేరుతుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, స్వతంత్రంగా ఉత్పత్తి నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వచ్చిన యూఏఈ, భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూఏఈ నిర్ణయం వెనుక చాలా కాలంగా ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అడ్నాక్ సంస్థ ద్వారా అబుదాబి 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించింది. రోజుకు 50 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి లక్ష్యాన్ని 2027 నాటికే చేరుకోవాలని, ముందుగా నిర్ణయించిన సమయానికి మూడేళ్ల ముందే పూర్తి చేయాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఒపెక్ నిబంధనల కారణంగా యూఏఈ చాలా సందర్భాల్లో తన అసలు సామర్థ్యంతో పోలిస్తే దాదాపు 30 శాతం తక్కువ ఉత్పత్తికే పరిమితమైంది.
యూఏఈ నిష్క్రమణతో ఒపెక్‌కు కూడా ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఎందుకంటే యూఏఈ ఆ సంస్థలో మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇప్పుడు ఒపెక్ సభ్య దేశాల సంఖ్య 11కు తగ్గింది. ప్రపంచ చమురు సరఫరాపై ఆ సంస్థ ప్రభావం కొంత మేర బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే హార్మూజ్ జలసంధి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఉత్పత్తిని క్రమంగా, బాధ్యతాయుతంగా పెంచుతామని యూఏఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న అంతరాయాల కారణంగా ఎగుమతులు పరిమితంగానే ఉన్నప్పటికీ, ఈ విధాన మార్పు దీర్ఘకాలికంగా భారత్ వంటి మిత్రదేశాలకు అనుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. ప్రత్యేకించి భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా మార్కెట్లలో ఇంకా డిమాండ్ బలంగా ఉన్న సమయంలో, తమ మిగిలిన చమురు నిల్వలను వేగంగా ఆర్థిక లాభాలుగా మలచుకోవాలన్న వ్యూహంతోనే అబుదాబి ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.













