సామాజిక చింతనాపరుడు, పర్యావరణవేత్త, తెలంగాణ రైతులతో క్షేత్రస్థాయిలో తన విజ్ఞానాన్ని అందించి, వారి వ్యవసాయ పద్ధతులు, సులభతరం చేయడానికి విశేషంగా కృషి చేసిన కె.ఎస్. గోపాల్, క్యాన్సర్ వ్యాధితో ఈ నెల 15వ తేదీన మరణించాడు. ఉన్నత చదువులు చదివిన ఆయనకు, ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉన్నా ఆయన, తన విజ్ఞానాన్ని, ఆలోచనలను క్షేత్ర స్థాయిలో ప్రయోగానికి పెట్టాడు. కె.ఎస్. గోపాల్ కమం (కొమండూర్ సంతాన గోపాల్) 1962లో కె.జి. దేసికన్, శంకుతలకు హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో, సెక్రటేరియట్‌లో ఒక శాఖకు కార్యదర్శి హోదాలో పని చేసాడు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ పాఠశాలలో హైస్కూలు విద్య పూర్తి చేసిన తర్వాత, కాచిగూడ లోని భద్రు క కాలేజీనుండి బి.కామ్ పూర్తి చేసి చేసి, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఎ, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో డిప్లొమా కోర్సు చదివాడు. స్కూల్‌లో, కాలేజీలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీల్లో బహుమతులన్నీ గోపాల్ కే దక్కేవట.

వై.ఎం.సి.ఎ విద్యార్థుల ఫోరంలో కూడా ఆయనే ముందుండేవాడట బాల్యం నుండే కొత్త కోణంలో ఆలో చించడం, విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి శోధించడం ఆయన గుణం. అందువల్లనే గోపాల్ వివిధ సామాజిక రంగంలో చేపట్టిన కార్యక్రమాల్లో ఆయన సృజనాశక్తి, ఒక క్రమ పద్ధతిలో విషయాన్ని అర్థం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం మనం చూస్తాం. 1977 నుండి 1980 వరకు హైదరాబాద్‌లో ఉన్న ప్రతిష్టాత్మకమైన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉపన్యాసకుడి గా, మేనేజ్‌మెంట్ డివిజన్‌లో చేరాడు. ఆ సంస్థకు శిక్షణకోసం వచ్చే అధికార్లకు, విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో ఆయన సంతృప్తి పడలేదు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పరచి గ్రామీణ అభివృద్ధి అంశాలపై ప్రణాళికలు తయారు చేసాడు. పూర్తి స్వేచ్ఛతో క్షేత్రస్థాయిలో తన ఆలోచనలు, ప్రయోగానికి పెట్టే కార్యాచరణకు పునాదులు ఇక్కడే పడ్డాయి. ఆయన ఆ సంస్థలో నిలకడగా ఉంటే సీనియర్ ప్రొఫెసర్ అయి, ఒక పెద్ద పరిశోధనా సంస్థకు డైరెక్టరో లేక ఒక ప్రఖ్యాత యూనివర్శిటీకి వైస్ ఛాన్సెలరో అయ్యేవారు. కాని గోపాల్ దృష్టి అంతా భూమి, భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న రైతులు, తెలంగాణలోని కరువు ప్రాంతాలు, వ్యవసాయం గిట్టుబాటు కాక సతమతమై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల మీదే ఉండేది.

ఆయన ఆస్కి సంస్థలో ఉన్న అకాడమిక్ వాతావరణం ఇష్టపడలేదు. రెండేళ్లు అక్కడ పని చేసిన తర్వాత, 1983లో డెక్కన్ డెవలప్‌మెంట్ సంస్థను ఇతర మిత్రులతో కలిసి స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలోని కరువు గ్రామాలలోని దళిత, బలహీన వర్గాల చిన్నకారు రైతులకోసం ఈ సంస్థను నెలకొలిపారు. దాదాపు నలుబది గ్రామాలలో గ్రామీణ మహిళలతో సంఘాలు ఏర్పరచి, వారి సాధికారత కోసం కృషి చేసారు. వారు చేస్తున్న వ్యవసాయ విధానంలో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి వివిధ పంటలు పండించడానికి ఈ సంస్థ దేశంలోనే మహిళా వ్యవసాయదారుల నమూనాగా తయారైంది. ఆయన తర్వాత వచ్చిన పి.వి. సతీష్ ఈ సంస్థను ఒక వివిధ కోణాల్లో విస్తరింపచేశాడు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు దాని అమలులోని లోటుపాట్లను సవరించడానికి, ఆ పథకాన్ని క్షుణంగా పరిశీలించి వ్యాసాలు, పుస్తకాలు రాసారు.ఈయన రాసిన వ్యాసాలు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి వెళ్ళి, గోపాల్‌ను ప్రధానమంత్రి చర్చలకు ఆహ్వానించాడు.

రాష్ట్రాలలో కూడా ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పరచి మాలాంటి హక్కుల కార్యకర్తలను దాంట్లోకి లాగి సమర్థవంతమైన పర్యవేక్షణ పద్ధతులు నిర్దేశించాడు. అప్పటి ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో రైతులు మానసిక రుగ్మత వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకు నష్ట పరిహారం ఇస్తే ఇంకా ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడతారని అహంకారపూరిత ప్రకటన చేసినప్పుడు ప్రొఫెసర్. కేశవరావు జాదవ్ సార్‌తో కలిసి రైతు సంక్షేమ నిధిని సేకరించి తెలంగాణ జిల్లాలలో దాదాపు 200 మంది రైతు ఆత్మ హత్యల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు గోదావరి జలాల పంపిణీ విషయంలో ఏం చేయవలసి ఉంటుదనే విషయాన్ని సాగునీటి జల నిపుణుడు భిక్షంగుజ్జతో కలిసి గోదావరి జలాలపై నివేదికలు తయారు చేసి ఉద్యమకారులకు అందుబాటులో ఉంచాడు. గ్రేయిన్ బ్యాంకు పేరుతో డి.డి.ఎస్ సంస్థలో ప్రారంభించిన ఒక కార్యక్రమాన్ని ఆహార భద్రతకు జోడించి ఒక పథకాన్ని తయారు చేసి ప్రభుత్వ సంస్థతో అమలు చేయించే ప్రయత్నం చేసారు. తెలంగాణ ప్రభాకర్, ఇతర మిత్రులతో కలిసి కాళోజీ ట్రస్ట్ ఏర్పరచి కాళోజీ నా గొడవ కవితలన్నీ ఒక సంకలనంగా తీసుకరావడంలో గోపాల్ చేసిన కృషి చాలా గొప్పది. ఆ కృషి వల్ల కాళోజీ నా గొడవ కవితలన్నీ భవిష్యత్తరాలకు భద్రపరచబడ్డాయి.

ఆసియా సామాజిక వేదిక, 2002వ సంవత్సరంలో హైదరాబాద్‌లో నిర్వహణలో గోపాల్ కృషి చాలా ఉంది. స్వచ్ఛంద సంస్థలకు కొంచెం దూరంగా ఉండే అభ్యుదయ సంస్థలు గోపాల్ లాంటి ఎంతోమంది మేధావులు సోషల్ ఫోరం ప్రక్రియలో భాగం పంచుకోవడానికి గోపాల్ ప్రయత్నం కొంతవరకు కారణం. నాకు, బూర్గుల ప్రదీప్‌కు పెద్ద బాధ్యతలు అప్పజెప్పి మన హైదరాబాద్‌లో దాన్ని నిర్వహించే విషయంలో మా పాత్రను గుర్తు చేసాడు. గోపాల్ సృజనాత్మక, ఆచరణాత్మక ఆలోచనలు చేసేవాడు. మూసలోపోసినట్లు ఆలోచించడం ఆయన స్వభావం కాదు. వ్యవసాయంలో బిందుసేద్యం పద్ధతి ద్వారా నీరు మొక్కకు అందించడం ఎప్పటి నుండో అమలులో ఉన్న ప్రక్రియ. ఆయనకు స్థిరమైన రాజకీయ అభిమాని గానీ, రాజకీయ అభిప్రాయాలు ఉన్నట్టుగానీ నేనైతే ఎప్పుడు గమనించలేదు.

అన్ని ప్రజా ఉద్యమాల పట్ల గౌరవంగా వ్యవహరించాడు. ఉన్నత పదవుల్లో, సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తులతో స్నేహం ఉండేది. ఎస్.ఆర్. శంకరన్, కె.ఆర్. వేణుగోపాల్, యుగంధర్, కెజి కన్నబిరాన్, సంజయ్ బారువా, గోపాల్ మేల్కొటే ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఆయనకు మంచి స్నేహితులు. విదేశాల్లో ఉన్న ఆలోచనాపరులు, సేవా రంగంలో ఉన్న వాళ్ళలో అనేకులు ఆయనకు మంచి మిత్రులు. అన్ని రకాల ఆలోచన ధారాలున్న వ్యక్తులతో ఆయనకు స్నేహం ఉండేది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ఆయన సహ విద్యార్థి. ఇంత వైవిధ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని, వ్యవసాయ ఉత్పత్తి లో భిన్నమైన పద్ధతులు అమలుపరిచి చూపెట్టిన కె.ఎస్. గోపాల్ మరణించడం మన అందరికీ తీరని విచారం. ఆయన ఒక బహుముఖ వ్యక్తిత్వం ప్రదర్శించిన ఉత్తమ మనిషి. మిత్రుడు కె.ఎస్. గోపాల్‌కు సెల్యూట్.


యస్. జీవన్‌కుమార్

(మానవ హక్కుల వేదిక)