
బెంగాల్‌లో ఇక ప్రచార ఘట్టం ముగిసింది. తిరిగి తాను ఇక్కడ బిజెపి ప్రభుత్వ ప్రమాణస్వీకార సభకు వచ్చే నెలలోనే వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండో విడత ఎన్నికల ప్రచార ముగింపు దశలో మోడీ సోమవారం నార్త్ 24 పరగణా జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పొల్గొన్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి విజయం ఆద్యంతం ఖాయం అని ప్రకటించారు. మొదటి విడత పోలింగ్‌లో రికార్డు అయిన అత్యధిక శాతం ఓటింగ్ తమ విజయ సంకేతానికి దారితీస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంతకాలం సిండికేట్ రాజ్యం సాగుతూ వచ్చింది. టిఎంసి ద్వారా సాగిన రాజకీయ హింసాకాండ, అణచివేతలు, మహిళలపై జులుం ఇకపై సాగబోవని ప్రకటించారు. అవినీతి రాజ్యం, సిండికేట్ల కాలానికి ఇక చెల్లుచీటి అని, మే 4న ఎన్నికల ఫలితాల తరువాత బిజెపి విజయం ప్రకటన వెలువడుతుంది. అప్పుడు తాను బిజెపి మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి బెంగాలీల వద్దకు వస్తానని ప్రధాని విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒడిషా, బీహార్ ఇటు అసోం తరువాత ఇక ఇక్కడ కూడా బిజెపిదే విజయం ఖాయం అని తెలిపారు. బెంగాల్ ప్రగతికి ఎటువంటి విజన్ లేని టిఎంసిని ఓటర్లు ఇక ఇంటికి పంపించివేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఎంసి పాలనలో మిల్లులు మూతపడ్డాయి. వ్యాపార సంస్థలు కుంటుపడ్డాయి. మరో వైపు నాటు బాంబుల ఫ్యాక్టరీలు వెలిశాయి. యువతను గూండాలుగా కిరాయికి తీసుకుంటున్నారు. వారితోదౌర్జన్యాలు సాగిస్తూ ఇక్కడి టిఎంసి రాజకీయ సిండికేట్ సాగిందని విమర్శించారు. ఇక ఈ శక్తులకు జనంగేట్లు మూసే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయని తెలిపారు. తాను ప్రచారానికి దిగిన ఈ బరాక్‌పూర్‌కు ప్రత్యేకత ఉందని చెప్పారు. 1857లో తొలి స్వాతంత్య్రోద్యమంలో ఈ నేల కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రాజకీయ మార్పునకు ఇక్కడి నుంచే దారితీస్తోందని తెలిపారు.












